రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైకాపా ప్రభుత్వం అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించడం... ప్రాథమిక విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించిన ప్రభుత్వం... సాగునీటి రంగానికి తెదేపా సర్కారుతో పోలిస్తే నిధులు తగ్గించడంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసే గాలేరు-నగరి, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించకపోవడంపై జిల్లా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాలాజీ, మల్లెమడుగు, వేణుగోపాల్‌సాగర్ జలాశయాల నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవడంతో వాటి నిర్మాణాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు.