చెన్నైలోని కోయంబేడు.. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయలు, పండ్ల మార్కెట్. ఎందరో రైతులు, ట్రేడర్లు ఇక్కడ వ్యాపారం సాగిస్తుంటారు. ఈ మార్కెట్ ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. తమిళనాడు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సుమారు 1500 ఈ మార్కెట్‌తో సంబంధమున్నవే. హడలెత్తిపోయిన తమిళ ప్రభుత్వం మార్కెట్‌ను తాత్కాలికంగా మూసేసింది.
తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాకూ కోయంబేడు మార్కెట్ నుంచి వైరస్ పాకడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన.. పలమనేరు, మదనపల్లె, నగరి, చిత్తూరు నగరం, సత్యవేడు నుంచి రైతులు, వర్తకులు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివస్తుంటారు. వారిలో ఇటీవల 9 మంది బాధితులకు కోయంబేడు లింకులున్నట్లు తేలిందని కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు. పలమనేరు నియోజకవర్గం వి.కోటకు చెందిన 21 మంది వ్యాపారులు కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఎవరికైనా సోకిందేమోననే అనుమానంతో... అప్రమత్తమయ్యారు.