సంక్రాంతి పండుగలో మూడవరోజు కనుమ వేడుకలను ప్రజలు కోలాహలంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జల్లికట్టు ప్రయత్నాలు మానుకోవాలని పోలీసులు పదేపదే హెచ్చరించినా.. గ్రామస్థులు సంప్రదాయానికే పెద్దపీట వేశారు.
పశువుల పండుగను జల్లికట్టు పేరిట నిర్వహించడం.. చిత్తూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆనవాయితీగా వస్తోంది. పండుగ వాతావరణం జనవరి ప్రారంభం నుంచే మొదలు కాగా.. సుమారు 45 రోజుల పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తరచూ ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. వేగంగా పరుగులు తీసే పశువుల కొమ్ములకు కట్టిన చెక్క పట్టెడలను సొంతం చేసుకోవడానికి యువత సాహసించడం ఇందులో విశేషం. పశువులను నియంత్రించే క్రమంలో యువకులు వాటి కింద పడి గాయాలపాలైనా.. మళ్లీమళ్లీ ప్రయత్నం చేస్తుంటారు.