చిత్తూరు జిల్లా చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల్లోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలైన శానంబట్ల, తొండవాడ, బుచ్చినాయుడుపల్లి, పిచ్చినాయుడుపల్లి, రెడ్డివారిపల్లి, దుర్గసముద్రం, రామచంద్రాపురం గ్రామాల్లో నిత్యం వందల ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. గతంలో రూ.750 ఉన్న ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం రూ. 3500 నుంచి రూ.5వేలు పలుకుతోంది. ఈ తతంగమంతా అధికారుల కనుసైగల్లోనే జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేయడం, అనంతరం వారిని విడిచిపెట్టడం పరిపాటిగా మారిందని పెదవివిరుస్తున్నారు.
అధికార పార్టీ నేతల ప్రమేయం...
ఈ క్రమంలో శనివారం ముంగిలిపట్టు గ్రామంలో స్థానికులు రెండు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతాల్లో అర్థరాత్రి వేళ జేసీబీ, డోజర్లతో టన్నుల కొద్ది ఇసుకను తోడేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ఇసుకకు డిమాండ్ మరింతగా పెరిగింది. ఇసుక అక్రమ రవాణాలో అధికారపార్టీ నాయకుల భాగస్వామ్యం ఉండడంతో ఈ దందా జోరందుకుంది.