కరోనా రెండో దశ చిత్తూరు జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. వరుసగా నాల్గో రోజూ కొవిడ్ కేసులు వెయ్యి దాటాయి. ఆదివారం ఒక్కరోజే తిరుపతి నగరంలో 687పాజిటివ్ కేసులు నమోదవ్వగా... తిరుపతి గ్రామీణ మండలంలో 109 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 22 ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స ఆందిస్తున్నారు. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు రోజుకు తీవ్రం అవుతుండగా... స్విమ్స్ ఆసుపత్రిలో మరణాల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి కావడంతో రాయలసీమ జిల్లాల నుంచి ఆరోగ్యం విషమించిన కేసులు స్విమ్స్‌కు తరలిస్తున్నారు. దీంతో స్విమ్స్ ఆసుపత్రిలో మరణాలు సంఖ్య పెరిగిపోతోంది. కరోనాకు చికిత్స పొందుతూ శనివారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు.
కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలను కొంతమంది కుటుంబసభ్యులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు పరిసర ప్రాంతాల మృతులను అంత్యక్రియల కోసం తిరుపతి గోవింద ధామం విద్యుత్ స్మశాన వాటికకు తీసుకువస్తున్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలు రోజుకు పన్నెండు నుంచి పదిహేను వరకు వస్తున్నాయి. శుక్రవారం 11, శనివారం 12, ఆదివారం 14 మందికి కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాతే ఎక్కువ మందిని స్విమ్స్‌కు తీసుకొస్తుండటంతోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.