చాలా కాలం కిందట పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పిన అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉందనేలా ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదించారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ నెల 28న హైకోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. పిటిషనర్లకు సొమ్ము ఎందుకు చెల్లించలేదో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించకపోతే.. రేపు మీ ప్రతిపాదిత మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకొస్తారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇలాగైతే మీ మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరొస్తారు: హైకోర్టు - Chittoor district updates
పనులు చేసిన వారికి బిల్లులివ్వడానికి నిధుల్లేవన్న అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించకపోతే.. రేపు మీ ప్రతిపాదిత మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకొస్తారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది
చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం పరిధిలో ఓ రహదారి పనులు నిర్వహించినందుకు రూ.21.41 లక్షల బిల్లులు ఖరారయినా చెల్లించడం లేదంటూ సీకే యర్రంరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఉపాధి హామీ, ఎస్‌డీఎఫ్ పథకాల కింద పనులు చేసినందుకు రూ.26.39 లక్షలు చెల్లించలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గుత్తేదారు ఆర్.శ్రీనివాసరావు మరో వ్యాజ్యం వేశారు. వీటిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. 2018, 2019ల్లో పనులు నిర్వహించారన్నారు. బిల్లులు చెల్లించాలని అధికారులను అడుగుతుంటే.. నిధులు లేవని చెబుతున్నారన్నారు. చేసిన పనులకు బిల్లులు అందక పిటిషనర్లు ఆర్థిక ఇబ్బందులతోపాటు మానసిక వేదనకు గురవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల చర్య పిటిషనర్లు, వారి కుటుంబసభ్యుల మనుగడ హక్కులను నిరాకరించడమేనన్నారు. సమాజంలో పిటిషనర్ల గౌరవం, హుందాతనాన్ని నాశనం చేయడమేనన్నారు. కార్మికులకు, నిర్మాణ సామాగ్రి తెచ్చినందుకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉంటుందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి