TARAKA RATNA HELATH UPDATES : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో సినీనటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్ పడిపోవడంతో ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదని.. లోబీపీ వల్ల స్పృహ తప్పి పడిపోయారని స్పష్టం చేశారు. కుప్పం ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ నటుడు బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు ఫోన్ చేసి అడుగుతున్నారు. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులంటున్నారు. ఎయిర్‌లిఫ్ట్ లేదా అంబులెన్స్ అని ఆలోచిస్తున్నాం. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -బాలకృష్ణ
చంద్రబాబు ఆరా: అస్వస్థతకు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యం అందిస్తున్న కుప్పం ఆసుపత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వద్ద ఉన్న బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ నిర్వహించామని, స్టoట్ అవసరం లేకుండానే తారకరత్న కొలుకున్నట్లు చంద్రబాబుకి వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్తగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.