ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సదరం ధ్రువపత్రాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిందేనా? దివ్యాంగుల సమస్య తీర్చే వారే లేరా? - sadaram certificates news in chittoor district

చిత్తూరు జిల్లాలో సదరం ధ్రువపత్రాల కోసం దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. లబ్ధిదారులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చి.. జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌కు విన్నవించుకుంటున్నారు. మరికొందరు స్థానిక సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు.

Disabled
దివ్యాంగులు

By

Published : Aug 17, 2021, 10:49 AM IST

సదరం ధ్రువపత్రాల కోసం చిత్తూరు జిల్లాలోని దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. వాటికోసం తిరుపతి, మదనపల్లె, నిమ్మనపల్లె, ములకలచెరువు, కంభంవారిపల్లె, పీలేరు నుంచి లబ్ధిదారులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చి.. జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌కు విన్నవించుకుంటున్నారు. మరికొందరు స్థానిక సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. వీరు దివ్యాంగులు, అంధులు కావడంతో బస్సుల్లో రావడానికి అవస్థలు పడుతూ రూ.వెయ్యి- రూ.2వేలు వెచ్చించి కార్యాలయాలకు వెళుతున్నారు.

సచివాలయాల్లో బుక్‌ చేసుకోవాలని చెప్పినా..

దివ్యాంగులు, అంధులు, వినికిడి సమస్యలతో అవస్థలు పడుతున్న వారు సదరం ధ్రువపత్రం పొందడానికి జులై 16 నుంచి స్లాట్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం గతనెలలో ప్రకటించింది. స్థానిక సచివాలయాలు లేదా మీ సేవ కార్యాలయాలకు వెళ్లి స్లాటు బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. అంగవైకల్యంతో బాధపడుతున్న వారు సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే.. తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెబుతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ సమస్య తలెత్తుతోందని అంటున్నారు. కొందరు సచివాలయ సిబ్బంది.. సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా పాలనాధికారిని కలిస్తే ఆయనే సమస్యను పరిష్కరిస్తారని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు 50- 100 కిలోమీటర్లు ప్రయాణించి కలెక్టరేట్‌కు వస్తున్నారు. తీరా ఇక్కడకు వస్తే.. తిరిగి దరఖాస్తులను మండల కార్యాలయాలకు పంపిస్తున్నారు.

పింఛన్లు తొలగించడంతో సమస్య

ఇటీవల దివ్యాంగులు, అంధులైన కొందరి పింఛన్లను స్థానిక సిబ్బంది తొలగించారు. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందని.. వారు ప్రశ్నిస్తే అంగ వైకల్య శాతం తగ్గిందని సమాధానమిస్తున్నారు. ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే ఎలా నిర్ధారిస్తారని అడుగుతున్నారు. కొత్తగా సదరం ధ్రువపత్రం తెచ్చుకుంటే పింఛన్‌కు అర్హులుగా చేస్తారని వాలంటీర్లు చెబుతున్నారు. ఈ విషయమై లబ్ధిదారులు సచివాలయ సిబ్బందిని అడుగుతున్నారు. వారిలో కొందరికి అవగాహన లేక.. కలెక్టరేట్‌కు వెళ్లమని సూచిస్తున్నారు. మరికొందరికి ప్రస్తుతం రూ.3వేలు పింఛన్‌ వస్తుండగా.. అధిక శాతం వైకల్యం ఉందని పేర్కొంటూ రూ.5వేల పింఛన్‌ కోసం కలెక్టరేట్‌కు వస్తున్నారు. ఇందుకు సంబంధించి సచివాలయ సిబ్బంది, వైద్యుల చేతిలో పరిష్కారం లేకపోవడంతో.. తప్పనిసరిగా పాలనాధికారికి విన్నవించుకోవాల్సిందే. వీరిని మినహాయించి.. మిగతావారు కలెక్టరేట్‌కు రాకుండా స్థానికంగానే సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటే లబ్ధిదారులకు అవస్థలు తీరనున్నాయి.

ఈ చిత్రంలోని మహిళ పేరు టి.కుమారి. ఊరు.. కంభంవారిపల్లె మండలం మోటుపల్లివాండ్లపల్లి పంచాయతీ గర్నిమిట్ట. గతంలో ఈమెకు దివ్యాంగుల పింఛన్‌ వచ్చేది. ఇటీవల అనర్హురాలిగా నిర్ధారించారు. స్థానిక సిబ్బందిని అడగ్గా.. కొత్తగా సదరం ధ్రువపత్రం తెచ్చుకోవాలని సూచించారు. దగ్గరలోని సచివాలయానికి పలుమార్లు వెళ్లినా.. ఈ అంశంతో తమకు సంబంధంలేదని తెలిపారు. చిత్తూరులోని కలెక్టరేట్‌కు వెళితే అక్కడ.. పని జరుగుతుందని సిబ్బంది చెప్పారు. ఆమె గ్రామంలోని మరికొందరితో కలిసి ఇటీవల ఉదయం 6 గంటలకు రూ.2వేలకు ఆటో అద్దెకు మాట్లాడుకొని కలెక్టరేట్‌కు వచ్చారు.

● ఇది ఒక్క కుమారి సమస్యే కాదు.. జిల్లావ్యాప్తంగా పలువురు దివ్యాంగులు, అంధులు, వినికిడి సమస్యతో బాధపడే వ్యక్తులు ఎదుర్కొంటున్నారు.

సమీప మీ- సేవలకు వెళ్లొచ్చు

దివ్యాంగులు, అంధులు, ఇతరత్రా వైకల్యంతో బాధపడుతున్న వారు స్థానిక మీ- సేవ కార్యాలయాలకు వెళ్లి.. స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్ఛు అనంతరం సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి.. సదరం పరీక్షలు చేయించుకోవచ్ఛు సచివాలయాల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.-శ్రీనివాస్‌, వికలాంగుల శాఖ, ఏడీ

ఇదీ చదవండి:

minister peddireddy : 'పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details