చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ఎగువ కన్నికాపురానికి చెందిన చంద్రకళ (35) హత్య కేసులో అయిదుగురు నిందితులను అరెస్టు చేశామని పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ పేర్కొన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి కుటుంబాల మధ్య 30 సంవత్సరాలుగా భూ తగాదాలు ఉన్నాయి. తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం రాత్రి విజయశేఖర్‌రెడ్డి పొలంలోకి ప్రవేశించిన నారాయణరెడ్డి వర్గీయులు మామిడి చెట్లను ధ్వంసం చేశారు.
ఈ విషయమై విజయశేఖర్‌రెడ్డి, అతని భార్య చంద్రకళ, తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ గణపతి, తల్లి సరస్వతమ్మ, చెల్లెలు పార్వతి, కుమారుడు విఘ్నయ్.. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి నారాయణరెడ్డిని నిలదీశారు. ముందస్తు పథకం ప్రకారం నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు విజయశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చంద్రకళ చికిత్స పొందుతూ మృతిచెందారు. మూడు కత్తులు, కారం పొడిని స్వాధీనం చేసుకున్నారు.