ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు.. మేలుకోకుంటే అంతే సంగతులు

చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. 14 రోజుల్లో 220 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తంగా ఉండకుంటే ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 506 కరోనా కేసులు నమోదయ్యాయి.

corona cases in tpt
corona cases in tpt

By

Published : Jun 15, 2020, 8:50 AM IST

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరింత అప్రమత్తం కావాల్సిన తరుణంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల్లో కాస్త నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముందున్నంత జాగ్రత్తలు ప్రస్తుతం తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నిత్యం పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈనెలలో 14 రోజుల్లో 220 మందికి పాజిటివ్‌ వచ్చిందంటే.. కేసుల సంఖ్య ఎలా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్ఛు.

విడతల వారీగా లాక్‌డౌన్‌లలో నమోదైన కేసులు

రెండో విడత లాక్‌డౌన్‌లో 11 రోజులు కరోనా కేసులే నమోదు కాలేదు. మూడో విడతతో కేవలం మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య సున్నాగా ఉంది. నాలుగో విడత లాక్‌డౌన్‌లో 14 రోజులూ కరోనా కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి విస్తరించింది. అయిదో విడతలో కేవలం 14 రోజుల్లోనే 220 మంది మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో అధిక శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరిని ముందుగానే క్వారంటైన్లలో ఉంచడంతో ముప్పు కొంత వరకు తగ్గింది.

పోలీసులు మళ్లీ దృష్టి సారిస్తేనే..

నాలుగు విడతల్లో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసిన పోలీసులు.. అయిదో విడత నుంచి పట్టించుకోవడం మానేశారు. అప్పటినుంచే వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పెరిగింది. పోలీసులు మరోసారి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. మాస్క్‌లు ధరించనివారితోపాటు భౌతికదూరం పాటించనివారి పట్ల గట్టిగా వ్యవహరిస్తే కరోనా గొలుసును నియంత్రించవచ్ఛు

తమిళనాడు మూలాలతో ముప్పు..

జిల్లాలో ముంబయి, హైదరాబాద్‌ మూలాలతో కరోనా కేసులు తక్కువగా ఉండగా.. తమిళనాడు ప్రభావంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు, పుత్తూరు, కేవీబీపురం, నిండ్ర మండలాల్లోని కేసులకు ప్రధాన కారణం తమిళనాడు మూలాలే. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారి కాంటాక్టుతో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించినా.. కొందరు ద్విచక్ర వాహనాల్లో రాత్రివేళ గ్రామాల్లోకి వస్తుండగా.. మరికొందరు అడ్డదారుల్లో వస్తున్నారు. వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉండక.. పల్లెల్లో కలియతిరుగుతున్నారు. దీంతో మహమ్మారి జిల్లాను వెంటాడుతూనే ఉంది.

వాలంటీర్లు అప్రమత్తమైతేనే..

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కొన్నిచోట్ల వాలంటీర్లు గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో స్వాబ్స్‌ తీయిస్తున్నారు. ఫలితం వచ్చేలోపే బాధితులు సరిహద్దులు దాటుతున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న వారిని గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వటంతోపాటు హోం క్వారంటైన్‌లో ఉండేలా చూస్తే ప్రమాదం తప్పుతుంది. వాలంటీర్లకు పోలీసులు, అధికారులు సహకరిస్తే.. కరోనా బాధితులను గుర్తించి వైరస్‌ విస్తరించకుండా చేయొచ్ఛు.

దాపరికంతో చేటు...

పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంత సమాచారం బహిరంగ పర్చడం ద్వారా ఇతరులు అప్రమత్తంగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఇది వరకు మొదట్లో ప్రకటించినా క్రమంగా దాపరికంతోనే వ్యవహరిస్తున్నట్ల్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిస్తున్న బులిటెన్‌లో కేసుల సంఖ్య ప్రకటిస్తున్నా జిల్లాల వారీగా వివరాలు ఉండడంలేదు. కొన్ని సందర్భాల్లోనే మండలాల వారీగా కేసుల సంఖ్యను జిల్లా అధికార యంత్రాంగం ప్రకటిస్తోంది. మండలాల వారీగా ప్రకటించడంతో ప్రయోజనం ఉండదని తిరుపతి శేషాద్రి నిలయం ప్రాంతానికి చెందిన భగవాన్‌ అంటున్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల ప్రకటన, హెచ్చరికల విషయంలో ముందున్నంత అప్రమత్తత ప్రస్తుతం లేదని వాపోయారు. సమాచారం బహిరంగపర్చడం ద్వారా వృద్ధులకు, ఇతరులకు ఉపయుక్తంగా ఉంటుందని.. జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

506 కరోనా కేసులు...

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి 506కి చేరువయ్యాయి. తాజాగా 9 కేసుల్లో తిరుపతి రూరల్‌ 3, కార్వేటినగరం 2, పుత్తూరు, చంద్రగిరి, విజయపురం, సత్యవేడులో ఒక్కొక్కటి వంతున పాజిటివ్‌ కేసులు వచ్చాయి.అయిదుగురు మహమ్మారికి బలయ్యారు.

ఇదీ చదవండి:'ఆన్​లైన్ టికెట్లు ఉంటేనే తిరుమలకు రావాలి'

ABOUT THE AUTHOR

...view details