CONFUSION OVER CANTRAL DECISION : లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం రాతపూర్వకంగా, మౌఖికంగా ఇచ్చిన సమాధానం అయోమయాన్ని సృష్టించింది. బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు గురించి తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెంకటేష్‌నేత, ఎంవీవీ సత్యనారాయణ, నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నుంచి వేర్వేరు సమాధానాలు వచ్చాయి. రాతపూర్వక సమాధానంలో ఆయన బల్క్ డ్రగ్స్ పార్కుని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినట్లు తెలపగా, మౌఖికంగా మాత్రం దాన్ని తెలంగాణకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో 144వ ప్రశ్న కింద పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్న వచ్చింది. స్పీకర్ ఓంబిర్లా పిలిచినప్పుడు వారిద్దరూ సభలో లేకపోవడంతో అనుబంధ ప్రశ్న వేయడానికి నామా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ‘‘దేశం చైనా నుంచి భారీగా బల్క్ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులను అరికట్టడానికి దేశంలో వాటి తయారీ పార్కులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల రాష్ట్రంలో పార్కు ఏర్పాటు కోసం సకాలంలో తెలంగాణ దరఖాస్తు చేసుకొంది. ఫార్మా రంగంలో హైదరాబాద్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తోంది. కరోనా సమయంలోనూ గరిష్ఠ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది. అన్ని సౌకర్యాలూ ఉన్న తెలంగాణకు ఆ పార్కును ఇస్తున్నారా? లేదా’’ అని ప్రశ్నించారు.