Land Scam: నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూముల కబ్జా.. పోలీసుల అదుపులో నిందితులు - cid traced out land scam at chittor
నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూముల కబ్జా.. పోలీసుల అదుపులో నిందితులు
By
Published : Oct 3, 2021, 1:56 PM IST
|
Updated : Oct 4, 2021, 3:42 AM IST
13:49 October 03
1,577 ఎకరాలను ఆన్‌లైన్‌లో సొంత భూములుగా మార్చినట్లు తెలిపిన సీఐడీ
చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. వీఆర్వోగా పనిచేసిన ఓ వ్యక్తి ఏకంగా 2,320 ఎకరాల ప్రభుత్వ భూమికి తన కుమార్తె, కుమారుల పేరిట నకిలీపత్రాలు సృష్టించాడు. ఇందులో 1,577 ఎకరాల భూమి వివరాలను ఒకేరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయించడం గమనార్హం. సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని కాజేసే ఈ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు బట్టబయలు చేశారు. తిరుపతి సీఐడీ డీఎస్పీ గుమ్మడి రవికుమార్ ఆదివారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని యాదమరి మండలం 184 గొల్లపల్లెకు చెందిన మోహన్ గణేష్ పిళ్లై వారసత్వ రీత్యా 1977 నుంచి గ్రామ కరణంగా పనిచేశారు. తర్వాత అక్కడే వీఏవోగా, వీఆర్వోగా పనిచేసి 2010లో ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో జిల్లాలోని సోమల, పుంగనూరు, పెద్ద పంజాణి, బంగారుపాళెం, యాదమరి, చిత్తూరు, కేవీపల్లె, గుర్రంకొండ, చంద్రగిరి, ఏర్పేడు, సత్యవేడు, రామచంద్రాపురం, తంబళ్ళపల్లె మండలాల్లోని 18గ్రామాల్లో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న 2,320 ఎకరాల భూమి తన తండ్రి శ్రీనివాస పిళ్లైకు వారసత్వంగా వచ్చినట్లు.. దాన్ని తన తల్లి అమృతవళ్లమ్మకు 1981లో బదలాయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించాడు. ఈ భూమి అమృతవళ్లమ్మ మనవళ్లు (మోహన్ గణేష్ పిల్లలు) ఎంజీ మధుసూదన్, ఎంజీ రాజన్, మనవరాళ్లు వి.కోమల, కె.ధరణిలకు చెందేలా వీలునామా రూపొందించాడు. దీనికి 1985లో బంగారుపాళ్యం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు.
కలిసొచ్చిన కంప్యూటరీకరణ
2005-10 మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలోని భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న తన కుమారుడు ఎంజీ మధుసూదన్ సహకారంతో గణేష్ పిళ్లై 2009 జులై 1న తన నలుగురు పిల్లల పేరిట 59 సర్వే నంబర్లకు చెందిన 1,577 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించాడు. తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా అడంగల్, 1బీ కాపీలు పొంది.. వాటికి నకిలీ పత్రాలు జతపరిచి సుమారు పది మందికి కొంత విక్రయించాడు. చౌడేపల్లి మండలం చారాలకు చెందిన రమణ సహకారంతో ఏర్పేడు, సత్యవేడు మండలాల్లోని భూములను శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించడానికి రూ.55.60 లక్షలు అడ్వాన్స్ తీసుకుని ఒప్పందపత్రం రాసి ఇచ్చాడు.
ఇలా వెలుగులోకి..
సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో సర్వే నంబరు 459లోని 160.09 ఎకరాల భూమికి అడంగల్, 1బీ ఆన్‌లైన్ చూపించి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఎంజీ రాజన్, ఎంజీ మధుసూదన్, ధరణి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సర్వే నంబరులో 45.42 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉండటంతో సోమల తహసీల్దారు శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రాథమిక విచారణ జరిపారు. అక్రమంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 2020 మే 29న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును జిల్లా ఎస్పీ సీఐడీకి అప్పగించారు. గతంలో పెద్ద పంజాణి మండలంలో అటవీ భూములకు అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందడానికి ప్రయత్నించినవారి పేర్లు, తాజాగా సోమల మండలంలో పాసుపుస్తకాలకు ప్రయత్నించిన వారి పేర్లు ఒకటే కావడంతో సీఐడీ ఆ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ గణేష్ పిళ్లై, అతని సంతానం ముగ్గుర్ని, అడవి రమణను శనివారం అరెస్టు చేశారు. గణేష్ కుమార్తె ధరణి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 40 పత్రాలు, స్టాంపులు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.