కేంద్ర ప్రభుత్వ సహకారం...చిత్తూరులో పరిశోధనలకు శ్రీకారం విశేషమైన అటవీ సంపద... అత్యున్నతమైన జీవ వైవిధ్యం... వేల రకాల ఔషధ మొక్కలు... ప్రపంచానికే ఆరోగ్య ప్రదాతగా ఘనమైన కీర్తి.. ఇవన్నీ మన దేశానికి ఉన్న ప్రత్యేకతలు. అన్ని ఉన్నా.. పరిశోధనా రంగంలో నెలకొంటున్న వెనుకబాటు తనం... ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి అనేక పరిస్థితులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అన్ని రంగాల్లో పరిశోధనా విభాగం ప్రాధాన్యతను పెంచుతోంది. ఈ దిశగా నిర్వహిస్తున్న రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న మోడ్రన్ టెక్నిక్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ - ఎంటీఎంబీ - 2019 కార్యశాల... ప్రత్యేక శిక్షణ తరగతులు అందిస్తోంది.
అధ్యాపకులకే అవగాహన
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యశాల... భావితరాల భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే.. చిత్తూరు జిల్లా శేషాచల అటవీప్రాంతంలో ఉన్న ఔషధ మొక్కలను గుర్తించే ప్రయత్నాన్ని, తద్వారా వాటి నుంచి ఔషధాలను తయారు చేసి ప్రాణాంతక వ్యాధులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలను గుర్తించటం, వాటిలో మందుల తయారీకి ఉపయుక్తమయ్యే భాగాలను వేరుచేయటం, ఐసోలేషన్ ఆఫ్ కాంపౌండ్స్, వాటిపై పరిశోధనలు జరపటం, వచ్చిన ఉత్పత్తులను జీవాలపై ప్రయోగించటం, ఫలితాలను అధ్యయనం చేయటం, ఆఖరికి ఔషధాలను తయారు చేయటం ఇలా పలుదశలుగా జరిగే ఈ ప్రక్రియపై బోధనరంగంలో ఉన్న అధ్యాపకులకు అవగాహన కల్పిస్తోంది.
ప్రత్యేక ప్రయోగశాల
ఎస్వీ విశ్వవిద్యాలయంలోని డీఎస్టీ పర్స్ సెంటర్లో జరుగుతున్న ఐదు రోజుల కార్యశాలలో స్పెక్ట్రోస్కోపీ, క్రొమాటోగ్రఫి, బ్లాటింగ్ టెక్నిక్స్, ఇమేజింగ్ టెక్నాలజీస్, నానో టెక్నాలజీ, ప్లాంట్ టిష్యూ కల్చర్, సెల్ కల్చర్ మొదలైన వాటి పైన పరిశోధనా బృందం సభ్యులు.... బోధనారంగంలో స్థిరపడిన వారికి అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పదికోట్ల రూపాయల నిధులతో మంజూరు చేసిన ప్రయోగశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు... ఆ విషయ పరిజ్ఞానాన్ని తమ కళాశాలల్లోని విద్యార్థులకు అందించటం ద్వారా వారిని పరిశోధనా రంగంవైపు ఆసక్తి కనబరిచేలా ప్రణాళికలు రచించారు.