లక్కీ డ్రా పేరిట మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని అంబూరుకు చెందిన వెంకటేష్ విలాసాలకు అలవాటుపడ్డాడు. బంగారుపాళ్యంలో 'శ్రీ సాయి హెల్త్ అండ్ వెల్త్ కేర్' పేరిట సంస్థను నెలకొల్పి..అందులో నిరుద్యోగ యువతను టెలీకాలర్స్గా నియమించుకుని ప్రజలకు ఫోన్ చేసేవాడు. లక్కీ డ్రాలో మీ చరవాణి నంబర్ వచ్చిందని, ఖరీదైన వస్తువులు కేవలం రూ.3వేలకే అందుతాయని నమ్మించి వందల మంది నుంచి నగదు రాబట్టాడు.
తమిళనాడు చిరునామాతో కొరియర్ ద్వారా పంపేవాడు. ఐరాల మండలానికి చెందిన ఓ వ్యక్తికి అదే కొరియర్లో ఇటుక రాయి రావడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేయగా వెంకటేష్ వ్యవహారం బయటపడింది. మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి, బీఎండబ్ల్యూ కారు, రూ.53వేల నగదు, 28 చరవాణిలు, కంప్యూటర్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ఈ కేసులో పనిచేసిన అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.