ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలంలో చీతా... తిరుమలలో తస్మాత్ జాగ్రత్త! - తిరుపతి

శేషాచలం అడవుల్లో చిరుతల సంచారం షరామామూలే! ఇటీవల తిరుమల కొండపై చీతా సరదాగా తిరుగుతోంది. భక్తులకు కనువిందు చేస్తూనే... హడలెత్తిస్తోంది. కనుమదారుల్లో... మఠాల వద్ద... స్థానికుల నివాసల్లో సంచరిస్తూ.. కలకలం రేపుతోంది. వెంకన్న దర్శనం దేవుడెరుగు కానీ... చిరుతల దర్శనం భక్తుల్లో వణుకు పుట్టిస్తోంది.

chitha_attacks_on_public_in_tirumala

By

Published : Jun 18, 2019, 7:56 AM IST

తిరుమల కొండపై చిరుతల సంచారం భక్తులను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల వీటి దర్శనం మరింత పెరిగిపోయింది. శేషాచలంలో అంతకంతకూ పెరుగుతున్న చిరుతలు జనసంబర్థంలో యథేచ్ఛగా కలియ తిరుగుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ వాటివల్ల పెను ప్రమాదాలు చోటుచేసుకోలేదు కానీ... ఆదివారం రాత్రి జరిగిన ఘటన మాత్రం యాత్రికుల్లో ఆందళన కలిగిస్తోంది.
నివాసాల్లోనే సంచారం...
అడవులకే పరిమితమయ్యే చిరుతలు ఇటీవల నివాసాల్లో సంచరిస్తున్నాయి. బాలానగర్‌లో స్థానికుల ఇళ్ల వద్ద తిరుగుతున్నాయి. కుక్కలు, పందులను వేటాడుతున్నాయి. గోగర్భం ప్రాంతంలోని మఠాల్లోకి దూకి అక్కడ బసచేసే భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం రెండో కనుమలో రహదారిలో ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. అది అక్కడికక్కడే మృతి చెందింది. దీన్నిబట్టి చూస్తే తిరుమలలో చిరుతల సంచారం ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
దర్శనం సంగతి దేవుడెరుగు...
వేకువజామున రెండు గంటలకు సుప్రభాతం దర్శనం, వీఐపీ ప్రారంభ దర్శనాలకు మఠాల నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో రోడ్లపైనే తిరుగుతున్నాయి. చిరుతలను చూసిన కొంతమంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లకుండా ఆగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. దర్శనం సంగతి దేవుడెరుగు... ముందు ప్రాణాలతో ఉండాలి కదా.. అనే ఆందోళన భక్తుల్లో నెలకొంటోంది. గతంలో ఓ మఠం వద్ద రెండు చిరుతలు గంటసేపు తిష్ఠ వేశాయి.
పిట్టగోడపై కాచుకుని...
మాధవ్‌ తిరుమలలో వ్యాపారం చేస్తుంటాడు. రాత్రి 9 గంటల సమయంలో తన కుమార్తెను తీసుకుని తిరుపతి నుంచి తిరుమల వెళుతున్నాడు. రెండో కనుమలో హరిణి వద్దకి రాగానే... అక్కడే పిట్టగోడపై కాచుకుని కూర్చున్న చిరుతపులి ఒక్కసారిగా దాడికి దిగింది. మాధవ్ చాకచక్యంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. కానీ.. కుమార్తె పావని కాళ్లకు గాయాలయ్యాయి. పది నిమిషాల వ్యవధిలో మరో వాహనంలో వస్తున్న వంశీ, యామిని దంపతులపైనా చిరుత పంజా విసిరింది.
మూడేళ్ల పాపపై...
తిరుమల కొండల్లో గతంలో మూడేళ్ల పాపపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అలిపిరి నడకమార్గంలోని జింకల పార్కులోకి దూకి జింకలను చంపేసింది. అధికారులు వెంటనే స్పందించి రెండు చిరుతలను బోనుల్లో బంధించారు. సుమారు 50 చిరుతలు శేషాచలంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటికి అడవుల్లో ఆహారం, నీరు లభించకపోవటం వల్లే జనవాసాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details