ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల పొట్టగొడితే సహించేది లేదు:చంద్రబాబు

వైకాపా నేతల భూ అక్రమాలు ఎండగట్టేందుకు విశాఖ వెళ్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఇంటి స్థలం ఇస్తామంటూ.. అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ నరకాసుర పాలనను తలపిస్తోంది మండిపడ్డారు.

chandrababu about ysrcp govt
chandrababu about ysrcp govt

By

Published : Feb 24, 2020, 8:05 PM IST

Updated : Feb 25, 2020, 6:47 AM IST

తొమ్మిది నెలల నరకాసురుడి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తెదేపా ముందుండి పోరాడుతుందన్నారు. కేసులు పెట్టినా ప్రజలు ముందుకు రావాలని సూచించారు. ‘గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. ఏం జరిగిందో మీకు తెలియదా? అనుమానాలున్న అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిపై విచారణ చేయడం ఎక్కడా లేదు. ఇది కేవలం తెదేపాపై చేస్తున్న దాడి కాదని, మొత్తం ప్రజలపై దాడి అన్నారు. నాడు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 26 కమిటీలు వేసినా ఏం చేయలేకపోయారు. ఇప్పుడూ ఏమీ చేయలేరు' అని అన్నారు.

కుప్పం పర్యటనలో చంద్రబాబు

ఆస్తులు ప్రకటించాలి...

'మేం మా ఆస్తులను ప్రకటించాం. దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా తీసుకోమన్నాం. ధైర్యం ఉంటే జగన్‌ తన ఆస్తులు ప్రకటించాలి. నువ్వు అనుభవించే ఆస్తులు నీవి కాదు. పారిశ్రామికవేత్తలు మీవల్లే వెనక్కు వెళ్లిపోతున్నారు. దీనివల్ల రాష్ట్రం నష్టపోతుంది. నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలకు గతంలో అసైన్డ్‌ భూములు ఇచ్చాం. వారు ఏళ్ల తరబడి వాటిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు వాటిని ఇళ్ల స్థలాల పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుపేదలకు స్థలాలివ్వడాన్ని మేం తప్పుబట్టడం లేదు. ఇంటి జాగా పేరుతో అసైన్డ్‌ భూములు లాక్కుని, గుడిసెలు కూలదోసి పేదల పొట్టకొట్టొద్దు అంటున్నాం. అవసరమైతే ప్రైవేటు భూములు కొనాలి. విశాఖపట్నం నేను మెచ్చిన నగరం. విశాఖ వెళ్లి.. అక్కడ వీళ్లు పేదల భూములను ఎలా కొట్టేశారో బయటపెడతా. మీరు నిజంగా విశాఖను అభివృద్ధి చేయాలని అనుకుంటే ఆదానీ డేటా సెంటర్‌ ఎందుకు వెనక్కు వెళ్లింది? లులూను ఎందుకు రద్దు చేశారు? విశాఖ మెట్రో రైలుకు ఎందుకు అడ్డుపడ్డారు? ప్రజలను, ప్రత్యర్థులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. పత్రికలపైనా ఆంక్షలు విధించారు. పోలీసులు బెదిరిస్తుంటే రికార్డు చేయండి. వారినీ వదిలిపెట్టం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచారు. దీనిపై నేను మాట్లాడితే మద్యం తాగేవాళ్లకు అనుకూలమని ఒక మంత్రి చెత్తగా వ్యాఖ్యానిస్తున్నారు. ధరలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి' అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.

వైకాపా నేతలు బెంగళూరు, తెలంగాణ, తమిళనాడుల నుంచి మద్యం తీసుకొచ్చి బెల్టు దుకాణాలు పెట్టి జనాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. 'మొన్న కుప్పంలో సభ పెట్టి ఏవేవో మాట్లాడారు. అవినీతి డబ్బులతో పెద్దపెద్ద కటౌట్లు పెట్టారు. నువ్వు, మీ అమ్మా నాన్నా వ్యవసాయం చేసి ఆ సొమ్ముతో కటౌట్లు కట్టారా? ఈ రోజు మా కటౌట్లు పెట్టడానికి వీల్లేదంటున్నారు. మేం తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది? వైకాపా నాయకులు హద్దు మీరితే వదిలిపెట్టం' అని హెచ్చరించారు. ఇవాళ కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగనుంది.

ఇదీ చదవండి:

'ఒకరికి మేలు చేసేందుకు.. మరొకరికి అన్యాయం చేస్తారా..?'

Last Updated : Feb 25, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details