Cattle Festival in Chittoor: చిత్తూరు జిల్లాలో సంక్రాంతికి ముందే పశువుల పండుగ మొదలైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో సంక్రాంతికి ముందుగానే ఈ వేడుక నిర్వహిస్తారు. ఇవాళ రామచంద్రాపురం మండలం నూకలగుంట గ్రామంలో నిర్వహించిన పశువుల పండుగ.. చూపరులను కట్టిపడేసింది. రంకెలేస్తూ.. దూసుకుపోతున్న పోట్లగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ వేడుకను చూసేందుకు స్థానికులతోపాటు సమీప గ్రామాలనుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
సుమారు 300 నుంచి 400 వరకు కోడె గిత్తలను నిర్వాహకులు పండుగలో భాగస్వామ్యం చేశారు. యువత కేరింతల నడుమ ఎద్దుల పందేలు జోరుగా సాగాయి. ఉరకలేస్తూ దూసుకుపోయిన కోడె గిత్తలను నిలువరించేందుకు యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. గిత్తల కొమ్ములకు కట్టిన పలకలు, వస్త్రాలను చేజిక్కించుకుంటే.. పౌరుషానికి ప్రతీకగా అక్కడి ప్రజల నమ్మకం. దీంతో ఎద్దులను నిలువరించేందుకు యువత తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.