చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం టాస్క్ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి శ్రీవారి మెట్టు రోడ్డు, చామల రేంజి నాగపట్ల బీట్లో సోదాలు చేశారు. ఈతగుంట ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని టాస్క్ ఫోర్స్ టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేయగా ఆరుగురు నిందితులు పట్టుబడ్డారు. ఘటనాస్థలంలో 14 దుంగలు లభించాయి.
నిందితులు తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన అర్జున్, ప్రకాష్, దక్షిణామూర్తి, అచ్యుతన్, శశి కుమార్, విజయ్లుగా గుర్తించారు. వారిలో ఇద్దరిని బాలలుగా గుర్తించి జువెనల్ హోంకు తరలించారు. మిగిలిన వారి గురించి దర్యాప్తు చేయగా.. ఆరో రోజుల క్రితం మొత్తం 16 మంది వచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మూడు రోజులుగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టారు.