ap high court on assigned lands: బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బహిరంగ వేలంలో కొన్నప్పుడు దానిని ప్రైవేటు భూమిగానే చూడాలని, అసైన్డ్‌గా పరిగణించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నిషేధిత జాబితాలో చేర్చుతూ ఇచ్చిన కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలోని వివిధ సర్వే నంబర్లలోని 9 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) బహిరంగ వేలం వేయగా తాము కొన్నామని, వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో(22ఏ) చేర్చిందంటూ పి.గీత, మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ‘అసలైన అసైన్డ్‌దారులు ఆ భూములను పీఏసీఎస్‌కు తనఖాపెట్టి రుణం పొందారు. తిరిగి చెల్లించనందున వాటి అమ్మకానికి పీఏసీఎస్ బహిరంగ వేలం వేసింది. పిటిషనర్లు కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. నేపథ్యం తెలుసుకోకుండా అధికారులు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అసైన్డ్ భూమిని తనఖాపెట్టి, తర్వాత వేలంలో అమ్మినప్పుడు అది ప్రైవేటు భూమి అవుతుందని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింద’ని వాదించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. వేలం నిర్వహించినప్పటికీ అది అసైన్డ్ భూమిగానే ఉంటుందన్నారు.