చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ.. తమిళనాడులో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడంతో కసరత్తు ముమ్మరం చేసింది. స్థలం కేటాయింపునకు సంబంధించి ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం మధ్య చర్చలు సాగినట్లు సమాచారం. తమ సంస్థకు రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘అడ్వాన్స్‌డ్ లిథియం టెక్నాలజీ రీసెర్చ్ హబ్’ను తమిళనాడులో నెలకొల్పాలని సంకల్పించింది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అమరరాజా సంస్థలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి.
చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లెవద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడం, కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు, పరిశ్రమల మూసివేత ఉత్తర్వులు జారీ, విద్యుత్ సరఫరా నిలిపివేత వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. సంస్థ హైకోర్టును ఆశ్రయించగా... విచారణ అనంతరం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మళ్లీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఆ తర్వాతా తరచూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టడం వేధింపుల్లో భాగమేనని యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల సంస్థ నాయకత్వంలో సంస్థాగత మార్పులు జరిగాయి.