ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్రం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయం ఉప సంహరణ'

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతోనే అమరావతికి ఆర్థికసాయం చేసే ఆలోచనను విరమించుకున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అయితే ఏపీకి తన సాయం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

By

Published : Jul 21, 2019, 7:45 PM IST

Updated : Jul 21, 2019, 8:49 PM IST

ప్రపంచబ్యాంకు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ప్రతిపాదన విరమించుకోవటంపై ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటన జారీ చేసింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము రుణ సహాయం విరమించుకున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు రుణం కోసం గతంలో చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్లుగా జులై 15న భారత ప్రభుత్వం నుంచి తమకు లేఖ వచ్చిందని ప్రకటనలో తెలిపింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఆ ప్రాజెక్టుకి రుణం ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు రద్దు చేసుకుందని వెల్లించింది.

బిలియన్ డాలర్ల సాయం కొనసాగిస్తాం

అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు నుంచి వైదొలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రపంచ బ్యాంకు తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన అభివృద్ధి ప్రాధామ్యాలను నిర్ణయించుకుని... కేంద్ర ప్రభుత్వం ద్వారా తమను సంప్రదిస్తే... ఆయా ప్రాజెక్టులను పరిశీలించి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ, తదితర రంగాల్లో వివిధ ప్రాజెక్టులకు ఒక బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని... అది కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీటిలో ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల సహకారం అందించేందుకు గతనెల 27నే ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది.

రాష్ట్రంపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌తో ప్రపంచ బ్యాంక్‌కి దీర్ఘకాలిక, ఫలప్రదమైన భాగస్వామ్యం ఉందని ప్రకటనలో వివరించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు వంటి వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒక మార్గదర్శిగా నిలిచిందని... ఇలాంటి వినూత్న కార్యక్రమాల్ని ఆంధ్రప్రదేశ్‌ నుంచి మిగతా దేశాలు నేర్చుకున్నాయని ప్రశంసించింది. అలాంటి కార్యక్రమాల్లో ఏపీతో భాగస్వామిగా ఉండడాన్ని తాము గర్విస్తున్నామని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది

సంబంధిత కథనం..అమరావతికి ఆగిన నిధులు.. ప్రశ్నార్థకంగా రాజధాని పనులు

Last Updated : Jul 21, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details