ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిపక్షంలో ఉంటే పార్టీ వీడాల్సిందేనా..?

తెలుగుదేశం పార్టీ.. 1989లో తొలిసారి ప్రతిపక్షం...ఉన్న 13 మంది ఎంపీల్లో ఆరుగురు జంప్. 2004లోనూ ప్రతిపక్షం అప్పుడే అంతే...ఇద్దరు ఎంపీలతో మొదలు పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. ఇప్పుడు మరోసారి ప్రతిపక్షం.. ఇంకేంముంది హిస్టరీ రిపీట్ అనేలా ఎంపీలు పార్టీ మారారు. వీరికితోడు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారీ ఫిరాయింపులతో సతమవుతూనే వస్తోంది సైకిల్ పార్టీ.

By

Published : Jun 22, 2019, 2:10 PM IST

Jumpings_Not_New_For_TDP

ప్రతిపక్షంలో ఉంటే పార్టీ వీడాల్సిందేనా..?
పార్టీ ఫిరాయింపులు రాష్ట్ర రాజకీయంలో దుమారం రేపుతున్నాయి. నేతలు పార్టీ వీడుతున్నారనే ఆందోళనలో తెలుగుదేశం ఉంటే....అంతే భయం అధికార పార్టీ వైకాపాలోనూ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెదేపాలో ఉన్న 2బలమైన సామాజికవర్గ నేతలను తమ పార్టీలోకి తీసుకొని బలపడొచ్చనే ఎత్తుగడ భాజపా వేస్తోంది. ఈ పరిణామాలు తెదేపాకు మింగుడపడని అంశంగా మారాయి. తెదేపాలో ముఖ్యంగా ఆది నుంచి రాజ్యసభ సభ్యులు పార్టీ మారటం సాధారణం విషయంగా మారితే...పదవీ కాలం పూర్తయ్యాక తాజాగా రెండోసారి అవకాశం ఇచ్చిన వారు పార్టీ వీడటం అవకాశవాదమేనని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఆది నుంచి పెద్దలు అంతే...
తెలుగుదేశం రాజసభ్య సభ్యత్వం కల్పించిన వారిలో పర్వతనేని ఉపేంద్ర, వైస్త్రాయ్ ప్రభాకరరెడ్డి, రేణుకా చౌదరి, జయప్రద, మోహన్‌బాబు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విజయమోహన్‌రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి ఇలా అనేక మంది పార్టీ మారిన వారే. కడప జిల్లా నుంచి ఐదుగురికి అవకాశం కల్పిస్తే వీరిలో నలుగురు పార్టీ మారారు. రాజ్యసభ అవకాశం దక్కించుకుని తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వారు మాత్రం యడ్లపాటి వెంకట్రావు, కంభంపాటి రామ్మోహనరావు, రావుల చంద్రశేఖరరెడ్డి వంటి అతి తక్కువ మంది నేతలే.
ప్రతిపక్షంలో ఉంటే వలసలే..
తెలుగుదేశం పార్టీ ఓడిన ప్రతిసారి నేతల వలసలు పార్టీకి అనవాయితీగా మారింది. 1989లో పార్టీ తొలిసారి ప్రతిపక్షంలోకి వచ్చింది. 1991లో కేంద్రంలో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేసినప్పటికీ చాలినంత మెజార్టీ లేదు. అప్పుడే తెలుగుదేశం నుంచి వలసలు మొదలయ్యాయి. 1992లో పీవీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు తెలుగు ప్రధానమంత్రికి మద్దతు నినాదంతో 13లో ఆరుగురు కాంగ్రెస్‌లో చేరారు. 2004లో ప్రతిపక్షంలోని వచ్చాక అదే సీన్‌...యూపీఏ-1పై అవిశ్వాసం పెట్టినప్పుడు ఇద్దరు తెదేపా ఎంపీలు గోడ దూకేశారు. 2009లోనూ వైఎస్ నాయకత్వానికి మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వై.బాలనాగిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైకాపా ఆవిర్భావలోనూ తెదేపా నుంచి ఫిరాయింపులు కొనసాగాయి. మైసూరారెడ్డి, తమ్మినేని సీతారాం, అమరనాథ్ రెడ్డి, కొడాలి నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు వంటి నేతలు తెదేపాను వీడి వైకాపాలో చేరారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారీ నేతలు వలస పోవడం తెదేపాకు అనవాయితీగా మారపోయింది.
యూరప్ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు తాజా పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను నేతల ద్వారా తెలుసుకుంటూనే ఎవరూ అధైర్యపడొద్దని చెప్తున్నారు. నలుగురు ఎంపీల చేరికతో ఆట మొదలుపెట్టిన భాజపా... మరింత స్పీడ్ పెంచే దిశగా అడుగులేస్తోంది. త్వరలో మరిన్ని చేరికలంటూ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యట ముగించుకొని వచ్చేలోపు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆందోళన తెదేపా శ్రేణుల్లో నెలకొని ఉంది.

ABOUT THE AUTHOR

...view details