ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నలుగురి ధిక్కారం.. దేనికి సంకేతం?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ మరో సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా..? ఆ పార్టీ ఎంపీ ఫేస్​బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యల వేడి చల్లారుతోందనుకుంటున్న సమయంలోనే... తెదేపాకు గట్టి షాక్ తగలడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఆపరేషన్ ఏపీలో ఆ నలుగురి ఎంపీల ధిక్కారం దేనికి సంకేతం? 15 మంది మాజీ ఎమ్మెల్యేల భేటీ వెనకున్న ఆంతర్యమేంటి? నవ్యాంధ్ర రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

tdp

By

Published : Jun 20, 2019, 5:49 PM IST

Updated : Jun 20, 2019, 6:06 PM IST

  • త్వరలోనే కమలం గూటికి తెదేపా ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

ప్రస్తుతం నవ్యాంధ్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. పార్టీ మారటం లేదంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన నలుగురు సభ్యులు.. చివరికి రాజ్యసభ ఛైర్మన్ ను కలిశారు. తెదేపాను వీడుతున్నట్లు లేఖను సమర్పించారు. రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్​లు తెదేపాను భాజపాలో విలీనం చేయాలని లేఖలో పేర్కొన్నారు. వీరి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేసింది.

ఎన్నికలు అయ్యాయి. ఫలితాలూ వచ్చాయి, అంతకుముందే చాలామంది పార్టీలు మారిపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి రాష్ట్ర పొలిటకల్ సర్కిల్ లో గోడదూకుడులపై చర్చ మొదలైంది. శాసనసభ ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితైన తెదేపాను.. వ్యూహాత్మకంగా దెబ్బతీసే పనిలో పడ్డారు కమలనాథులు. భారీ ఆధిక్యంతో ఓ పక్క వైకాపా అధికారం సాధించిన జోష్ లో ఉంది. మరోవైపు... ప్రతిపక్షంలో ఐదేళ్లు కొనసాగటం ఎలా అని సందిగ్ధంలో ఉన్న నాయకులపై దృష్టి పెట్టింది భాజపా. అనుకున్నదే తడవుగా... తెదేపా ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపే పనిలో పడింది. ప్రతిగా... సదరు ప్రజాప్రతినిధులూ తమ అనుచరులతో సమావేశాలు జరపుతున్నారు. వీరిలో నలుగురి రాజ్యసభ సభ్యుల చేరిక ఖరారుకాగా.. మిగతా నేతలూ నిర్ణయం ప్రకటిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమతో భాజపా సంప్రదింపులు నిజమే అని తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తెదేపాను వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నా... తొలుత పార్లమెంట్ సభ్యులపైనే దృషి సారించింది భాజపా. ఇప్పటికే నలుగురు ఎంపీలు భాజపాలో చేరేందుకు ముందుకొచ్చారు . ఇదే సమయంలో తెదేపా రాష్ట్ర స్థాయి నాయకులు అదే బాటలో నడిచేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్...

కేంద్రంలో భారీ ఆధిక్యంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ... ఫుల్ జోష్ లో ఉంది. సొంత బలంతో 303 స్థానాల్లో కమలనాథులు విజయఢంకా మోగించారు. సార్వత్రిక పోరులో ఉత్తరాదిన పెద్ద మొత్తంలో స్థానాలు గెలిచినా.. దక్షిణాదిన ఆశించిన మేర రాణించలేకపోయింది. ముఖ్యంగా... నవ్యాంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ కేవలం 1 శాతం లోపు కూడా ఓట్లు సాధించలేదు. నోటా కంటే వచ్చిన ఓట్లు తక్కువే. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించటం, తెదేపా కనీస పోటీ ఇవ్వకపోవటం జరిగాయి. ఇదే అదునుగా భావిస్తున్న భాజపా.. ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయశక్తిగా ఎదిగే దిశగా పావులు కదుపుతోంది.

తెలంగాణలోనూ...

తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయం తామేనంటూ సవాల్ విసురుతూ మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలతో భాజపా దూకుడు పెంచుతోంది. తాజాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ధిక్కార స్వరం వినిపించడమే కాదు.. తెరాసకు తెలంగాణలో భాజపానే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించడం.. తాజా రాజకీయ పరిణామాలను చెప్పకనే చెబుతోంది. ఇక నవ్యాంధ్రలోనూ అదే వ్యూహన్ని అనుసరిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Last Updated : Jun 20, 2019, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details