నైరుతీ రుతుపవనాలు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. మాల్దీవులు, శ్రీలంక సమీపంలోని కామోరిన్, దక్షిణ అరేబియా సముద్ర ప్రాంతాల్లో విస్తరించిన రుతుపవనాలు... కేరళతీరంలోకి అడుగుపెట్టటంతో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజులు ఆలస్యంగా చేరుకున్నప్పటికీ... రుతుపవనాల ప్రభావంతో జోరుగా వానలు కురుస్తున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, తమిళనాడులో విస్తరిస్తూ రాయలసీమ జిల్లాలకు చేరుకునేందుకు మరో 3రోజుల సమయం పడుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనువైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా... ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కొల్లాం, అలప్పుజ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... తదుపరి రోజు తిరువనంతపురం, పతినంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.