ఒక్క ఓటు చాలు...నేతల తలరాతను మార్చేందుకు. అలాంటి వందల ఓట్లు ఎవరికి కాకుండా పోతే...ఇప్పుడు ఆ ఓట్లనే తమ ఓటు బ్యాంకులో వేసుకోవాలనుకుంటున్నారు నేతలు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా మీట గెలుపోటములను ప్రభావితం చేసింది. కొన్ని స్థానాల్లో అభ్యర్థి కంటే..నోటాకు వచ్చిన ఓట్లే అధికం. ఇంకొన్ని చోట్ల మెజార్టీ కంటే నోటా ఓట్లు ఎక్కువున్నాయి. అందులోవి ఓడిపోయిన వ్యక్తివైపు పడుంటే.. ఫలితం తారుమారవుతుంది. హోరాహోరీ ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థితోపాటు నోటా ఓట్లనూ వశం చేసుకునే పనిలో పడ్డారు నేతలు.
2014లో నోటాకు పోలైన ఓట్లు కిందటి ఎన్నికల్లో రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలను ప్రభావితం చేసిందినోటా. చాలా చోట్ల 1,000నుంచి 1,500 ఓట్లు నోటాకు పడ్డాయి. మరోవైపు 1,500 లోపు ఆధిక్యతతో 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి నేతలకు ఇదే భయం పట్టుకుంది. తమకు పడాల్సిన ఓట్లలో కొన్ని నోటాకు వెళ్లినా గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఆ దిశగా ముందే జాగ్రత్తలు తీసుకుంటూ.. నోటాకు వద్దని తమకే ఓటేయాలని ప్రచారంలో చెబుతున్నారు.
ఎక్కువ...తక్కువ
* నోటాకు అత్యధికంగా ఓట్లు పోలైన నియోజకవర్గం:విశాఖపట్నం జిల్లా అరకు (ఎస్టీ) - 4,933
*నోటాకు అత్యల్పంగా ఓట్లు పోలైన నియోజకవర్గం: ప్రకాశం జిల్లా కనిగిరి- 361
మెజార్టీ కంటే ఎక్కువే..
*గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 12 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ నోటాకు పడినవి 635 ఓట్లు.
*శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కంబాల జోగులు 512 ఓట్ల ఆధిక్యతతో విజయం దక్కించుకున్నారు. ఆయన సాధించిన ఆధిక్యం కంటే నోటాకు 182 ఓట్లు ఎక్కువ వచ్చాయి.
దూరం...తక్కువే...
*తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కిందటి ఎన్నికల్లో 713 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు 615 ఓట్లు పోలయ్యాయి.
*చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ఎం.సునీల్‌కుమార్ 902 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించగా... నోటాకు 783 ఓట్లు వచ్చాయి.
*అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా చాంద్‌బాషా 968 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించగా...నోటాకు 733 ఓట్లు వచ్చాయి.
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో...
*రాష్ట్రంలో ఏడు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు... ప్రతీచోటా నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి.
*అరకులోయ నియోజకవర్గంలో అత్యధికంగా 4,933, పాడేరులో 2,828, కురపాంలో 2,077 ఓట్లు నోటాకు వచ్చాయి.
2014 ఎన్నికల్లో..
*ఓటర్లు: 3,67,60,880
*పోలైన ఓట్లు: 2,87,91,613
*నోటాకు లభించిన ఓట్లు: 1,49,418 (0.51 శాతం)