కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో భాగంగా జిల్లాల నుంచి రెవెన్యూ శాఖ వివరాలు కోరుతోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో... అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా, రెవెన్యూ మండలాల వారీగా ఉన్న జనాభా, ఇతర సమాచారాన్ని వెంటనే పంపాలని పాలనాధికారులను కోరినట్లు రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా... వీటికి అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే... ఇప్పుడున్న జిల్లాల స్వరూపాన్ని మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో ఐదింటికి, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన 12 జిల్లాల్లో మరో అయిదింటికి ఎటువంటి ఆటంకాల్లేవని... మిగిలిన జిల్లాల విషయంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.
కొన్ని మండలాల్లోని గ్రామాలు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉండటం... జిల్లా కేంద్రాలు దూరం కావడం వంటి సమస్యలు గుర్తించారు. జిల్లా అధికారుల నుంచి పలు కోణాల్లో రెవెన్యూ శాఖ వివరాలు కోరింది. లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా గుర్తించడంలో ఉన్న సమస్యలు... తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షా సమావేశం జరిగితే... కొత్త జిల్లాల ఏర్పాటు పరిస్థితిని వివరించేందుకు రెవెన్యూ సిద్ధమైంది.