''వలంటీర్ పోస్టులు.. వైకాపా నేతలు అమ్మేసుకుంటున్నారు'' - grama valunteer interviews
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పీపీఏలు (విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు), గ్రామ వాలంటీర్ల నియామకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
కొన్ని రోజులుగా జగన్ ప్రభుత్వంపై ట్విటర్లో మండిపడుతున్న లోకేశ్.. మరోసారి ఘాటుగా ట్వీట్లు చేశారు. గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలు సక్రమంగా జరగటం లేదని.. వైకాపా నేతలు వీటిని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. 'ఉత్తుత్తి ఇంటర్వూలు నిర్వహించి యువతను మోసం చేస్తారా?. ఇందుకేనా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది?. దీనికి స్వచ్ఛంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది' అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే పీపీఏల్లో లేని అవినీతిని ఎక్కడ నుంచి వెలికితీస్తారు అని నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్లు సక్రమంగా జరిగాయని... జగన్ నిర్ణయాలతో విద్యుత్ రంగంలో దేశ వ్యాప్తంగా పెట్టుబడులు వెనక్కి వెళ్తాయి అని కేంద్రం నుంచి లేఖలు వచ్చినట్లు పేర్కొన్నారు. 'ఎన్ని లేఖలు వచ్చినా.. నేను పట్టిన కుందేలుకి అసలు కాళ్లే లేవు అంటున్న జగన్ గారూ! వెకిలి వేషాలు మాని ముందు ప్రజల సమస్యలపై బుర్ర పెట్టండి' అంటూ ఘాటుగా ట్వీట్లు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని లేఖలను ఆయన ట్వీట్లకి చేర్చారు.