తెలంగాణ పోలీసుల జోక్యమేంటీ?
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని ఎంపీ కనకమేడల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 8 లక్షలకు పైగా ఓట్లను తొలగించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఒకవేళ డేటా చోరీకి గురైతే కేసు ఏపీ ప్రభుత్వానికి అప్పగించకపోవడానికి కారణమేంటని ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. డేటా చోరీ కేసు అంశం సాకు చూపి తెలంగాణ పోలీసులు కుట్రకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల సమాచార సేకరణలో ఏపీ ప్రభుత్వ పాత్ర ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పడాన్ని చూస్తే కుట్ర అర్థమవుతోందని అన్నారు. పక్క రాష్ట్రం పోలీసులుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసును ఇప్పటికైనా ఏపీకి బదలాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ పాలనా వ్యవహారాల్లో తెలంగాణ పోలీసుల జోక్యమేంటని మండిపడ్డారు. భాజపా సూచనల మేరకు వైకాపా, తెరాస చర్యలు తీసుకుంటున్నాయని విమర్శించారు.