'కాగ్ నివేదిక తప్పు' - CAG
రఫేల్ పై కాగ్ ఇచ్చిన నివేదికలో లోసుగులున్నాయని ఎంపీ కనకమేడల అన్నారు. ప్రధాన అంశాలు దాచి నివేదిక ఇచ్చారన్నారు. కాగ్ నివేదికను తప్పుదోవ పట్టించడంలో విజయసాయిరెడ్డి హస్తముందని ఆరోపించారు
రఫేల్ అంశంలో కాగ్ నివేదిక తప్పుదోవ పట్టించిందని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఏ అంశానికి ఎంత అనే స్పష్టత నివేదికలో ఇవ్వలేదన్నారు. కీలకాంశాలు తొలగించి కాగ్ నివేదిక ఇచ్చారన్నారు. పీఎంవో ఆడిట్ చేసిన కాగ్ నివేదికలోనూ లొసుగులున్నాయన్నారు. అసలు విషయాన్ని దాచి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని కనకమేడల విమర్శించారు.
రఫేల్ విషయంలో కేంద్రాన్ని వైకాపా వెనకేసుకొస్తోందని కనకమేడల దుయ్యబట్టారు. కాగ్ నివేదిక తప్పుదోవ పట్టించడంలో విజయసాయిరెడ్డి హస్తముందని ఆరోపించారు. లక్ష కోట్ల జగన్ అవినీతిని 43 వేల కోట్లకు తగ్గించిన ఘనత విజయసాయిరెడ్డిదన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం లేదని ప్రజలు భావిస్తున్నారని కనకమేడల అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్నే కోరుతున్నారన్నారు.