చంద్రగిరి నియోజకవర్గంలో 166, 310 బూత్‌లలో పోలింగ్ సక్రమంగా జరగలేదని ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నాని రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని కళా తెలిపారు. అదే ప్రతులను కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపినట్లు వెల్లడించారు. ఆ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఇప్పటికీ ఏమీ తేల్చలేదని మండిపడ్డారు.
ఎన్నికల సంఘానిది ఏకపక్ష ధోరణి: కళా - కళా వెంకట్రావు
ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు తెదేపా ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదులను పక్కనపెట్టి.. పోలింగ్ జరిగిన 24 రోజులకు వైకాపా అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడమేంటని ప్రశ్నించారు. తెదేపా నేతలతో కలిసి రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మకు ఆయన వినతిపత్రం సమర్పించారు.
పోలింగ్ పై వచ్చిన అభ్యంతరాలపై విచారణ పూర్తి చేశాక రీ పోలింగ్ నిర్వహించాలి. కానీ ఇప్పటికే రీ పోలింగ్ ముగిశాక మరోసారి పోలింగ్ నిర్వహంచడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
రీ పోలింగ్ ముగిశాక వైకాపా అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదుపై సీఈఓ స్పందించటమేంటని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు ఫిర్యాదు చేయకుండా వైకాపా అభ్యర్థి సీఈఓ వద్దకు వెళ్లడం...ఆయన అభ్యర్థనపై సీఈఓ నివేదిక కోరడమేంటని సందేహం వ్యక్తం చేశారు.