మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగించారు. 'మా ప్రభుత్వం ప్రజా సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం. అవినీతిరహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చాం. ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ చేపడుతాం' అని గవర్నర్ వెల్లడించారు.
నవరత్నాల అమలు
మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు. విభజన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పథకాల ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.