ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల సామగ్రి తయారీ @ తాడేపల్లి

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ఊరూ.. వాడా నాయకుల ప్రచారాలతో హోరెత్తిపోతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న శైలిలో ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఐదేళ్లకోమారు వచ్చే బ్యాలెట్ పోరు.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే కాదు. వందల మంది కూలీల కడుపు నింపుతోంది.

ఎన్నికల సామగ్రి @ తాడేపల్లి

By

Published : Mar 19, 2019, 8:46 PM IST

Updated : Mar 20, 2019, 1:04 PM IST

ఎన్నికల సామగ్రి @ తాడేపల్లి
సార్వత్రిక బరిలో నిలిచే అభ్యర్థులు... వాళ్ల అనుచరులు నూతన ఆలోచనలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఓటర్లను ఆకర్షించే విధంగా పార్టీ జెండాలు, టీషర్టులు, టోపీలు, తోరణాలతో హడావిడి చేస్తారు. అందుకే.. ఎన్నికల పండగొచ్చిందంటే చాలు... ఎక్కడెక్కడి నుంచో కూలీలు తాడేపల్లికి వస్తుంటారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి... ప్రచారం ముగిసే వరకు రకరకాల సామగ్రి సిద్ధం చేస్తారు.

ఇక్కడ చకచకా పనిచేసేస్తున్నవారంతా బిహార్​కు చెందిన కూలీలు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడే వీళ్లకు చేతి నిండా పనిదొరుకుతుంది. ఈసారి ఎన్నికలకు పెద్దగా సమయం లేక... ఇచ్చిన ఆర్డర్లు పూర్తి చేసేందుకు వీళ్లు ఇలా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పార్టీ జెండాలు, తోరణాలు, టోపీలు, గొడుగులు ఇలా ఒకటా రెండా... పార్టీ గుర్తుపై ప్రజల దృష్టి పడేలా విభిన్న రకాల వస్తువులు తయారు చేస్తున్నారు.

విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న తాడేపల్లిలో... ప్రచార సామగ్రి తయారు చేస్తున్న ఈ పరిశ్రమ పేరు నీలిమ గ్రాఫిక్స్. సాధారణ సమయంలో వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రచార బ్యానర్లు, టీషర్టులుతయారు చేస్తుంటారు. ఎన్నికల రాకతో వీళ్లు మిగిలిన పనులకు విరామమిచ్చి... ఎన్నికల ప్రచారం కోసం వస్తువులు తయారుచేస్తున్నారు.

ఒకప్పుడు ప్రచారాలంటే పార్టీ కండువాలు, బ్యానర్లు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రచారంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. పార్టీ అధినేతల ముఖచిత్రాలతో విసన కర్రలు, టోపీలు, కీ చైన్లు, గొడుగులు తయారుచేస్తున్నారు. ప్రచారం చేసే కార్యకర్తలకు పార్టీ చిహ్నాలతో టీషర్టులు పంచిపెడుతున్నారు.

మహిళల కోసం పార్టీ రంగుల్లో చీరలు ఇచ్చేవారు. ఈసారి ఆ చీరల్లోనూ కొత్త ఒరవడి వచ్చింది. టీ షర్టుల మీద పార్టీ అధినేతలు, పోటీ పడుతున్న అభ్యర్థుల చిత్రాలు ఉన్నట్లే... చీరలపైనా పార్టీ అధినేతల ముఖచిత్రాలను ముద్రిస్తున్నారు.

ఈ సారి ఎన్నికలకు ఎక్కువ సమయం లేక రోజంతా పనిచేయాల్సివస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. సమయం తక్కువున్నా... ప్రచారంలో మాత్రం తగ్గేది లేదంటూ ప్రధాన పార్టీలన్నీ పోటా పోటీగా ప్రచార సామగ్రిని సిద్ధం చేయిస్తున్నాయి.

Last Updated : Mar 20, 2019, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details