ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఓటర్ల నమోదులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆయన... ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై కలెక్టర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు.
'పార్టీలు సహకరించాలి' - ap election commission
సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కోరారు.
ఓట్లు తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. ఓట్ల తొలగింపు అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. తొలగించాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలని... 7 రోజులు సమయం ఉంటుందని వివరించారు. జాబితా సవరణలకు నామినేషన్ ఆఖరి వరకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలు సిద్ధమైందని తెలిపారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 2,90,780... కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 2,44,635 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 19,593 మంది ఓటర్లున్నారని గోపాలకృష్ణ వివరించారు. ఈ నెల 23, 24న పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని... ఫారం 6, 7, 8తో పాటు ఓటర్ల జాబితాతో వస్తారని తెలిపారు.