కేసీఆర్ కనుసన్నల్లోనే వైకాపా మేనిఫెస్టో: దేవినేని - ఏపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లోనే వైకాపా మేనిఫెస్టో విడుదలైందని మంత్రి దేవినేని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కుల ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతిపక్ష వైకాపా వ్యవహార శైలిని మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్తో వైకాపా నేతలు మంతనాలు జరుపుతోందని అగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి - కృష్ణా నదులు అనుసంధానం చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని...వైకాపా విడుదల చేసిన మేనిఫెస్టోలో కనీసం నదుల అనుసంధానం అంశమే లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కనుసన్నల్లోనే వైకాపా ఎన్నికల హామీ పత్రం విడుదలైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల ఘర్షణలు సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఇవన్నీ వైకాపా నేత విజయసాయి రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నాయని అన్నారు. వీటిని ఆరికట్టేందుకు ఎన్నికల సంఘం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమన్నారు.. మంత్రి దేవినేని.