విభజన అనంతరం రాష్ట్రంలో అడ్రస్ గల్లంతైంది. కిందటి ఎన్నికల్లో డిపాజిట్లే దక్కలేదు. కేంద్ర మంత్రులు నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఐదేళ్లు క్షేత్రస్థాయి పోరాటాలతో బలపడేందుకు చేసిన ప్రయత్నం ఏమాత్రం ఫలితాన్నివ్వలేదు. మారిన రాజకీయ సమీకరణాలతో తెదేపా, కాంగ్రెస్ జట్టుకట్టాయి. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో ఊపుతీసుకొచ్చింది. తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాలతో వ్యూహం మార్చిన రెండు అధిష్ఠానాలు రాష్ట్రంలో ఒంటరి పోరుకే మొగ్గు చూపాయి. ఇదీ హస్తం నేతల్లో నిరాశకు కారణమైంది. సైకిల్ సవారీతో కొన్ని సీట్లైనా గెలుచుకోవచ్చని భావించిన నాయకులకు అధిష్ఠానం నిర్ణయం మింగుడుపడలేదు.
ఒంటరి పోరే ...
ఏపీలో ఒంటరి పోరే అంటూ కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టత ఇలా ఇచ్చిందో లేదో వెంటనే... ఇక దారులు వెతుకునే పనిలో పడ్డారు కొందరు ముఖ్యనేతలు. కర్నూలు మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. రేపో మాపో సైకిల్ ఎక్కేలా కనిపిస్తోంది.
అదే బాటలో నడిచారు కేంద్రమంత్రిగా, యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహారించిన మరో నాయకుడు కిషోర్ చంద్రదేవ్. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన ఆయనకు డిపాజిట్ దక్కలేదు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఆయన చేతిని వదిలేశారు. త్వరలోనే రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తాని చెప్పారు.
కేంద్ర మాజీమంత్రి, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి సైతం కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా కడప జిల్లా రాజకీయాల్లో 3 దశాబ్దాలకుపైగా కీలకంగా వ్యవహారించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకోవటం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ -తెదేపాల మైత్రి జీర్ణించుకోవటం కష్టమన్న కారణంతో మాజీ మంత్రి సి, రామచంద్రయ్య, పసుపులేటి బాలరాజు వంటి నేతలు పార్టీ మారారు.
నాడు..నేడు
నేడు జరుగుతున్న పరిణామాలే, కిందటి ఎన్నికలకు ముందు జరిగాయి. నాడు రాష్ట్రాన్ని విభజించారనే కారణంతో...పార్టీలోని కీలక నేతలు బయటికి వచ్చారు. ముఖ్యమంత్రిగా వ్యహారించిన కిరణ్ కుమార్ రెడ్డితో మొదలు సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్, తులసిరెడ్డి, శైలజానాథ్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, పితాని సత్యనారాయణ, సాయిప్రతాప్, గంటాశ్రీనివాస రావు, గల్లా అరుణ వంటి నేతలు పార్టీ మారారు. ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, టీజీ వెంకటేశ్ తెదేపాలో చేరారు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ భాజపా గూటికి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ జగన్ జట్టులో చేరిపోయారు.
కాంగ్రెస్‌ను వీడాలని భావిస్తున్న నేతలను తమతో కలుపుకొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంతోపాటు పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తామని సంకేతాలు పంపుతున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరికొంత మంది నేతల్లో ఎంతమంది ఉంటారో లేక పార్టీని వీడుతారో వేచిచూడాల్సిందే.