రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు ఇవాళ చేపట్టారు. సచివాలయంలో రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.తన ఛాంబర్‌లో సతీసమేతంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాగునీటి సమస్య తొలగిస్తా
ఎన్నికల హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. అభివృద్ధి పరంగా దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానంలో ఉండాలనేదే తమ లక్ష్యమని అన్నారు. తాగునీటి సమస్యను రూపుమాపేందుకు కృషి చేస్తామన్నారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడంపై మంత్రి స్పందించారు. తమ ప్రభుత్వం ఎవరితోనూ కక్షపూరితంగా వ్యవహరించదని అన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం పై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. రాజధాని భూములు సహా నిర్మాణాల్లో అవినీతిని ప్రక్షాళన చేస్తామన్నారు.
మోపిదేవి బాధ్యతలు
పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖమంత్రిగా మోపిదేవి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని ఛాంబర్‌లో మోపిదేవి వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. సతీసమేతంగా ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.
పాడిపరిశ్రమను లాభదాయకంగా మారుస్తాం
నష్టాల్లో ఉన్న పాడిపరిశ్రమను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మోపిదేవి అన్నారు. అందులో భాగంగానే లీటర్ పాలపై 4 రూపాయల బోనస్ ప్రకటించామని తెలిపారు. రైతుల పంటలను నిల్వచేసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు కృషి చేస్తామన్నారు. గొర్రె చనిపోతే 6వేల రూపాయల పరిహారం ఇస్తామన్నారు. మత్స్యకారులకు వేట నిషేద సమయంలో ఇచ్చే మొత్తాన్ని 10వేలకు పెంచడం సహా వేటకు వెళ్లినప్పుడు ఎవరైనా మరణిస్తే 10లక్షల పరిహారం అందిస్తామన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శక ,అవినీతి రహిత పాలన అందిస్తామని .. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు