గ్రీవెన్స్ హాల్‌ను అక్రమంగా కట్టారని తొలగిస్తే ప్రశ్నిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని తొలగిస్తే చర్చ ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్ హాల్‌ను కట్టారని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఇళ్లు కూలిపోవడం ఇటీవల చూస్తున్నామని...నీళ్లు పారే మార్గానికి అడ్డుకట్ట వేస్తే మరో మార్గంలో పారితే మునిగిపోతాయని తెలిపారు. అన్నీ తెలిసి చట్టాలను ఉల్లంఘిస్తే ఏమనాలి అని సీఎం జగన్ ప్రశ్నించారు.
శాసనసభలో గందరగోళం.. కరకట్ట నిర్మాణాలపై చర్చ - babu
శాసనసభలో కరకట్ట నిర్మాణాలపై వాడీవేడి చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పడం కాదు...
ఒకరిని చూసి మరొకరు ఇలానే తయారైతే నీళ్లు ఎటు పారాలన్నారు జగన్. ప్రజావేదికలోనే ఐఏఎస్, ఐపీఎస్‌లను కూర్చోబెట్టి అక్రమ కట్టడం అనే విషయం తెలిపానని... 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పడం కాదు... నలుగురికి ఆదర్శంగా ఉండాలని సీఎం సూచించారు. చెడిపోయిన వ్యవస్థను మార్చుదామని అనుకుంటే అడ్డుతగులుతున్నారని అన్నారు.
అవసరమైతే రోడ్డుపై పడుకుంటా: చంద్రబాబు
మాపై ఆరోపణలు చేసినప్పుడు మేమూ సమాధానం ఇవ్వాలి కదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజావేదిక తన భవనం కాదని... ప్రభుత్వానిదని తెలిపారు. రమేష్ అనే వ్యక్తి వద్ద అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నానని అన్నారు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటానే తప్ప... ఎవరి బెదిరింపులకు లొంగనని ఘాటుగా సమాదానమిచ్చారు. భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందన్న చంద్రబాబు...దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు.