దిల్లీలో భాజపాయేతర పక్షాల సమావేశం దిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో భాజపాయేతర రాజకీయ పార్టీలు సమావేశమయ్యాయి. తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ, ఆప్ నేత సంజయ్ సింగ్, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంపై చర్చ జరిగింది. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందనే ఆరోపణలపై మాట్లాడారు. ఈవీఎంలలో లోపాలపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అంశంపై సమాలోచనలు జరిపారు.
''అవి.. పనికిరాని ఈవీఎంలు''
సాంకేతికత ఎక్కడ వాడాలి.. ఎక్కడ వాడకూడదో తెలుసుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల్లో పనికిరాని ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు.
యంత్రాలపై విశ్వాసం లేదు: కపిల్ సిబల్
యంత్రాలపై విశ్వాసం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. పేపర్ బ్యాలెట్పైనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఓటరు ఎవరికి ఓటు వేస్తారో వారికే ఓటు చెందాలన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. యంత్రాలు ఎలా దుర్వినియోగం అవుతాయో తాము చూపిస్తామని సవాల్ విసిరారు.
వీవీప్యాట్ లెక్కించాల్సిందే!
దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించకపోతే కనీసం వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం యంత్రాల్లో భాజపాకే ఓటు వెళ్లేలా ప్రోగ్రామ్ చేశారని ఆరోపించారు. దిల్లీలో 30 లక్షలు, తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. న్యాయబద్ధంగా ఎన్నికల్లో గెలవాలని హితవు పలికారు.
లక్షలాది ఓట్లు తొలగించారు!
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ. తమ పోరాటానికి 15 ప్రాంతీయ, 6 జాతీయ పార్టీలు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిశీలన లేకుండా లక్షలాది ఓట్లను ఎలా తొలగిస్తున్నారని ప్రశ్నించారు.