YSRCP Leader Suicide Attempt: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని యార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కాడు ఏ వైసీపీ నేత. తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదని, దళితుడిని అనే కారణంతోనే తనకు గుర్తింపు లేదని ఆరోపించారు.
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వేలమూరిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జ్యోతి రోశయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో నిరాశ చెందిన రోశయ్య.. ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో మార్కెట్ యార్డులోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోశయ్యని.. స్థానికుల సాయాంతో కిందకు దింపారు. అనంతరం అక్కడ నుంచి అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావటంతో.. రోశయ్య చైర్మన్ పదవి కోసం ఆశపడ్డాడు. అయితే అది దక్కదని తలచి.. తాను ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యాడు. స్థానిక వైసీపీ నేత కృష్ణ చైతన్య తనను పట్టించుకోవటం లేదని.. జగన్ మోహన్ రెడ్డి చెప్పినా సరే తనకు ఏ పదవి ఇవ్వడం లేదని అక్కసు వెళ్లగక్కారు.