Repalle Rape: రేపల్లె రైల్వేస్టేషన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నేరాలకు పాల్పడే వారికి పోలీసులంటే భయం లేకుండా పోయిందని మండిపడ్డాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదివారం ఉదయం తెదేపా, జనసేన, ఎమ్మార్పీఎస్‌తో పాటు పలు ప్రజా సంఘాలు రేపల్లె సామాజిక ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. బాధితురాలిని పరామర్శించేందుకు స్థానిక తెదేపా నాయకులు ఆసుపత్రిలోకి వెళుతుంటే పోలీసులు అభ్యంతరం తెలపడంతో వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తెదేపా నాయకులు దండమూడి ధరణికుమార్, అంకాలు, తిరపతయ్య, ఖాదర్‌బాషా, గోపి, మల్లికార్జునరావు తదితరులను అరెస్టు చేశారు. జనసేన మహిళా నాయకురాలు కమతం విజయకుమారి తదితరులు బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఒంగోలులో ఉద్రిక్తత:రేపల్లె రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచార బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొండపి తెదేపా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, యర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు, మాజీ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, నాయకులు, కార్యకర్తలు, బాధితురాలి బంధువులు, గ్రామస్థులు రిమ్స్ వద్దకు తరలివచ్చారు. పోలీసులు గేట్లు మూసి వారిని అడ్డుకోవడంతో రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి.. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితురాలిని పరామర్శించేందుకు మంత్రి విడదల రజని వస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు ఎమ్మెల్యే స్వామి, ఎరిక్షన్‌బాబును అరెస్టు చేసి తరలించేందుకు ప్రయత్నించగా పెనుగులాట చోటుచేసుకుంది. వాహనానికి అడ్డుపడిన మహిళలను పోలీసులు బలవంతంగా ఈడ్చివేశారు. పెనుగులాటలో ఎమ్మెల్యే కాలివేలికి గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించి, స్టేషన్‌కు తరలించారు.
రూ.10 లక్షలు పరిహారమివ్వాలి:అత్యాచారానికి గురైన దళిత మహిళకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, పిల్లలకు ప్రభుత్వమే చదువులు చెప్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిలకా కిరణ్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు కిషోర్ డిమాండ్ చేశారు. దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌మోహన్‌రెడ్డి దళితులకు పరిహారం అందించటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జీజీహెచ్‌కు కాకుండా బాధితురాలిని ఒంగోలు రిమ్స్‌కు తరలించటమేమిటంటూ అంబులెన్స్‌కు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని పక్కకు లాగి, అంబులెన్స్‌ను ఒంగోలుకు పంపారు.
దోషులను కఠినంగా శిక్షిస్తాం:ఒంగోలు రిమ్స్‌కు చేరుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ఇచ్చామన్న ఆమె.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
"రేపల్లె బాధితులకు రూ.2 లక్షల పరిహారం ఇచ్చాం. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఘటన గురించి తెలిసిన వెంటనే ఎస్పీతో సీఎం మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకున్నాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం." - విడదల రజని, వైద్యారోగ్యశాఖ మంత్రి
బాధితురాలికి మంత్రి నాగార్జున పరామర్శ:బాధితురాలిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు దురుద్దేశంతో విమర్శిస్తున్నాయన్నారు. ప్రభుత్వం బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందిస్తుందని, కుటుంబానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కుమారుడు రాజీవ్ రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.