Numaish Exhibition 2023: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరగనున్న 82వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనకు కరోనా, ఇతర కారణాల దృష్ట్యా గత రెండేళ్లుగా ఇబ్బందులు తలెత్తగా.. ఈ ఏడాది పెద్దఎత్తున నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు చేపట్టింది. 1500 మంది ఎగ్జిబిటర్లతో 2,400 స్టాళ్లు ఈ వస్తు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
దేశ, విదేశాలలో ప్రాముఖ్యత సంతరించుకున్న నుమాయిష్‌కు ఏటా లక్షలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ ఏడాది 22 లక్షల మంది వరకు నుమాయిష్‌కు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాట్లలో భాగంగా స్టాళ్ల కేటాయింపులు దాదాపుగా పూర్తి కాగా... స్టాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. నూతన సంవత్సరం వేళ ఇవాళ సాయంత్రం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.