Nara Lokesh Yuvagalm Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మానపాలెం వద్ద యువగళం పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు భారీ కార్యకర్తలు తరలివచ్చారు.
అమరావతి రైతుల సంఘీభావం: ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్రను రాజధాని అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు ప్లకార్డులు చేతపట్టి ప్రదర్శించారు. రాజదానికి భూమిని ఇచ్చి అబాసుపాలయ్యామని.. రాబోయేది చంద్రబాబే.. మన రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేయగల నాయకుడని గుర్తించి తమ పొలాలను రాజదాని కోసం దారపోశామని అన్నారు.
జ్ఞాపికగా లోకేశ్ అద్భుత చిత్రం: కాగా అంతకు ముందు యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల సరిహద్దులో గుళ్లాపల్లి క్యాంప్ సైట్లో పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నారా లోకేశ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుళ్లాపల్లి సభా ప్రాంగణం పర్చూరు నియోజకవర్గ ప్రజలతో కిక్కిరిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలాక్సీ గ్రానైట్‌తో తయారు చేయించిన అద్భుత చిత్రాన్ని లోకేశ్‌కు జ్ఞాపికగా అందజేశారు.
నాయకులు వస్తూ పోతూ ఉంటారు.. కార్యకర్తలే శాశ్వతం: ఈ సందర్భంగా నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 కోట్లమంది ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. జిల్లాలో పెద్దాయన అని చెప్పుకుని తిరిగిన వ్యక్తి పార్టీ మారినా.. కార్యకర్తలు మారలేదన్నారు. నాయకులు వస్తూ పోతుంటారు, కార్యకర్తలే శాశ్వతమని నారా లోకేశ్ తెలిపారు.
భారీ కూరగాయల గజమాలతో స్వాగతం: గుళ్లాపల్లి కూడలికి వచ్చిన లోకేశ్‌కు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, మహిళలు కూరగాయలతో తయారుచేసిన గజమాలతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేరుగా పార్టీనే స్పందిస్తోంది.. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు బీమా కల్పించామన్నారు.