ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంట గ్యాస్‌ సరఫరాలో ఇష్టారాజ్యం.. చిల్లరే కానీ.. లెక్కేస్తే లక్షలే..!

Additional Charges for Gas Supply: వంట గ్యాస్‌ సిలిండరు ధరపై అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల గ్యాస్‌ సిలిండరు ధర బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగా మారుతోంది. ఒక్కో నెలలో పెరుగుతూ, మరో నెలలో తగ్గుతూ ఉండటం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండటం లేదు. ఇదే ఎక్కువనుకుంటే.. సిలిండరు అసలు ధర కంటే.. ఇంటికి అందించే సమయంలో అదనంగా వసూలు చేస్తుండటం మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా కనిపించినా.. నెలనెలా ఇది లక్షల్లో సాగుతోంది.

వంట గ్యాస్‌
వంట గ్యాస్‌

By

Published : Jan 21, 2023, 10:56 AM IST

Additional Charges for Gas Supply : తెలంగాణలోని నల్గొండ పట్టణానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల గ్యాస్‌ సిలిండరు మీద అదనపు వసూళ్లపై డెలివరీ బాయ్‌ను నిలదీశాడు. వెంటనే ఆ వ్యక్తి.. సిలిండరు ఇవ్వడానికి నిరాకరించాడు. గట్టిగా మాట్లాడితే ఇంటి బయటే సిలిండరు వదిలేశాడు. చేసేదిలేక విశ్రాంత ఉద్యోగి పూర్తి మొత్తం ఇవ్వాల్సి వచ్చింది.

నల్గొండ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ గృహ వినియోగదారుడు ఇరవై రోజుల క్రితం గ్యాస్‌ తెప్పించుకున్నాడు. వాస్తవ సిలిండరు ధర కంటే.. అదనంగా రూ. 20 వసూలు చేశారు. సదరు గృహ వినియోగదారు ఇంటికి, గ్యాస్‌ గోదాముకు మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్ల లోపే. అయినా ఎక్స్​ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్యాస్‌ ఏజెన్సీకి చైతన్యపురి కాలనీ 5 కి.మీ దూరం లోపే ఉంది. ఇక్కడ వంట గ్యాస్‌ డోర్‌ డెలివరీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీ డోర్‌ డెలివరీ బాయ్‌ సిలిండర్‌ ధర కంటే అదనంగా 25 రూపాయలు వసూలు చేశాడు. సదరు గృహిణి మారుమాట్లాడకుండా ఆ మొత్తం ఇచ్చేశారు.

ఇలా కేవలం నల్గొండ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండరు ధరపై అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల గ్యాస్‌ సిలిండరు ధర బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగా మారుతోంది. ఒక్కో నెలలో పెరుగుతూ, మరో నెలలో తగ్గుతూ ఉండటం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండటం లేదు. ఇదే ఎక్కువనుకుంటే.. సిలిండరు అసలు ధర కంటే.. ఇంటికి అందించే సమయంలో అదనంగా వసూలు చేస్తుండటం మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా కనిపించినా.. నెలనెలా ఇది లక్షల్లో సాగుతోంది.

ఎప్పటి నుంచో అక్రమ వసూళ్ల దందా :జిల్లాలో గ్యాస్‌ సిలిండరు సరఫరా అక్రమ వసూళ్ల దందా ఎప్పటినుంచో సాగుతున్నా.. అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒక వైపు బిల్లులపై ఉన్న ధరకు అదనంగా చెల్లించవద్దని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఇంటికి తీసుకొచ్చే ఏజెన్సీ సిబ్బంది మాత్రం రూ.20 నుంచి రూ. 50 వరకూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే సిలిండరుపై రూ.20 నుంచి 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. చాలామంది గృహిణులు వాస్తవ మొత్తాన్ని గమనించకుండా అడిగినంతా ఇచ్చేస్తున్నారు.

కొంతమంది ప్రశ్నిస్తే.. దురుసుగా ప్రవర్తించడం, సిలిండరు వెనక్కి తీసుకెళ్లిపోయి, తాళం వేసి ఉందని నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమకేమీ జీతం ఉండదని, తెచ్చినందుకు ఛార్జీల రూపంలో వచ్చేదే ఆదాయమని చెప్పడంతో మారుమాట్లాడకుండా ఆ మొత్తాన్ని ఇచ్చేస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీలు నిర్ణయించిన ధరే తాము వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 50కి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు చాలామంది దీపం పథకాన్ని వినియోగిస్తున్నారు. వీరికి ఏజెన్సీలు చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. తాము వెళ్లి సిలిండర్లను తెచ్చుకోలేక, ఇంటికి తీసుకొస్తే అదనపు మొత్తం చెల్లించలేక గ్యాస్‌ వినియోగానికి దూరం అవుతున్నారు.

ఐదు కిలోమీటర్లు దాటితేనే :గ్యాస్‌ సిలిండర్లకు అదనంగా వసూలు చేయవద్దని ఏజెన్సీలకు చెబుతున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిలిండరు డెలివరీ పరిధి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితమేనని, పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఐదు నుంచి 30 కిలోమీటర్ల వరకైతే రూ.10 మాత్రమే అదనంగా వసూలు చేస్తారని తెలిపారు. ఏజెన్సీలు, సిబ్బంది వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అధికారులు వివరించారు.

ఏజెన్సీలు వాడేసుకుంటున్నాయి :గోదాం నుంచి వినియోగదారుడి ఇంటి వరకు సిలిండరును చేర్చి, ఖాళీ సిలిండరును మళ్లీ గోదాంలో చేర్చేందుకు గాను ప్రతి ఏజెన్సీకి సదరు కంపెనీలు రవాణా ఛార్జీలు చెల్లిస్తాయి. ఆ మొత్తాన్ని సిబ్బందికి ఇచ్చి, ఎమ్మార్పీకే సిలిండర్లను సరఫరా చేయాల్సిన బాధ్యత ఆయా ఏజెన్సీలదే. అయితే కంపెనీలిచ్చిన రవాణా ఛార్జీలను ఏజెన్సీలు వాడేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీలు తమకు జీతం ఇవ్వడం లేదని, వినియోగదారుల నుంచే వసూలు చేసుకోవాలంటున్నారని డెలివరీ బాయ్‌ ఒకరు తెలిపారు. సొంతవాహనంతో బండ చాకిరి చేస్తూ రూ. 20 మాత్రమే గ్యాస్‌ బండకు వసూలు చేస్తున్నట్లు వివరించాడు.

మనకు చిల్లరే అయినా.. మొత్తంగా రూ. లక్షల్లోనే..ఉమ్మడి జిల్లాలో 71 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. సాధారణ, సీఎస్‌ఆర్‌, దీపం కలిపి మొత్తం 8,94,536 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ గ్యాస్‌ వినియోగం తప్పనిసరైంది. ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుండా సిలిండరు తీసుకుంటున్న కనెక్షన్లు 4 లక్షలు వేసుకున్నా.. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున రూ. 20 అదనపు వసూళ్లు అనుకున్నా.. మొత్తంగా 80 లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లే. మనం చిల్లరే కదా అని వదిలేసిన మొత్తం ఒక నెలలో రూ. 80 లక్షలు.

చర్యలు తీసుకుంటాం.. 'గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ సిలిండర్‌ సరఫరా సమయంలో అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు చేపడతాం.' - పుల్లయ్య, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి, సూర్యాపేట

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details