ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tried to Sell her Baby: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి.. కానీ అంతలోనే

By

Published : Apr 27, 2023, 2:49 PM IST

Mother Tried to Sell her Baby: కాన్పు జరగకముందే.. తన బిడ్డను అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. వివాహేతర సంబంధం వలన ఆ యువతి గర్భం దాల్చినట్లు సమాచారం. పేదరికం కారణంగానే అమ్మకానికి పెట్టినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఇది ఎక్కడ జరిగిందంటే?

Baby for Sale
పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి

Mother Tried to Sell her Baby: బాపట్ల పట్టణంలోని వివాహేతర సంబంధం వలన గర్భం దాల్చిన యువతి.. పేదరికం కారణంగా కాన్పు జరగకముందే పసికందును అమ్మకానికి పెట్టిన అమానవీయ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. చీరాల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దంపతులతో లక్ష రూపాయలకు బిడ్డను విక్రయించేలా ఒప్పందం చేసుకుంది. బిడ్డను కొనుగోలు చేస్తామన్న వారే గర్భిణి అయిన యువతికి ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేయించారు.

పుట్టిన పసికందుకు ఆరోగ్య పరీక్షలు చేయించటానికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలన్న క్రమంలో వివాదం ఏర్పడి విషయం బహిర్గతమైంది. స్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులకు సమాచారం రావటంతో వారు పసిబిడ్డ విక్రయాన్ని అడ్డుకున్నారు. యువతికి కౌన్సిలింగ్‌ చేసి ఆమెనే బిడ్డను పెంచేలా హామీ పత్రం తీసుకున్నారు.

బాపట్ల పట్టణానికి చెందిన ఆ యువతిది నిరుపేద కుటుంబం. తండ్రి లేడు. తల్లి ఇళ్లలో పనులు చేస్తూ పెంచి పెద్ద చేసింది. 16 ఏళ్ల వయస్సులో మండల పరిధిలోని జమ్ములపాలేనికి చెందిన యువకుడితో వివాహమైంది. కొంత కాలానికే భర్త వదిలేయటంతో పుట్టింటికి వచ్చేసింది.

ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడ పని చేస్తున్న ఓ వ్యక్తి కారణంగా గర్భం దాల్చిందని సమాచారం. అబార్షన్‌ చేయించుకోవాలని ప్రయత్నిస్తుండగా అదే కంపెనీలో పని చేస్తున్న చీరాల మండలం గవినివారిపాలేనికి చెందిన శివ అనే సహచర మహిళా కార్మికురాలు వారించింది. తనకు సంతానం లేదని బిడ్డను ఇస్తే రూ.లక్ష ఇస్తానని యువతికి చెప్పింది.

పేదరికంలో ఉన్న యువతి బిడ్డను విక్రయించటానికి అంగీకరించింది. పురిటి నొప్పులు రావటంతో బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం చేర్పించారు. సిజేరియన్‌ చేయాల్సి ఉందని గుంటూరు సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. పుట్టిన వెంటనే బిడ్డను కొనుగోలు చేస్తామన్న శివ, వెంకటేష్‌ దంపతులు.. గర్భిణిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి సిజేరియన్‌ ద్వారా కాన్పు చేయటానికి అయిన రూ.20 వేలు చెల్లించారు.

యువతి బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన పసికందుకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని యువతిని శివ, వెంకటేష్‌ దంపతులు కోరారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డను ఇస్తేనే రూ.లక్ష ఇస్తామని అన్నారు. ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చు యువతే భరించాలని.. లేకుంటే ఇచ్చే నగదు నుంచి మినహాయిస్తామని చెప్పారు. దీనికి యువతి తల్లి అంగీకరించలేదు.

ఈ విషయంపై యువతి తల్లి, శివకు మధ్య వాగ్వివాదం జరిగి బిడ్డను విక్రయిస్తున్న సమాచారం బహిర్గతమైంది. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జయప్రద, స్థానిక మహిళా పోలీసు, అంగన్‌వాడీ కార్యకర్తతో ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి బిడ్డను కొనుగోలు చేయటం నేరమని శివ, వెంకటేష్‌ దంపతులను హెచ్చరించారు. దీంతో వారు వెళ్లిపోయారు. పుట్టిన బిడ్డను తల్లే పెంచాలని లేకుంటే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణలోకి తీసుకుని గుంటూరు తరలిస్తామని అధికారులు తెలిపారు.

"రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రసవం అయింది. ఆ సమయంలో.. ఆ అమ్మాయి ఆర్థికంగా లేని వాళ్లు కాబట్టి ఆ బిడ్డని మాకు ఇస్తామని చెప్పారు అని వేరే వాళ్లు వచ్చారు. తరువాత గొడవ జరిగిన కారణంగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై కౌన్సిలింగ్ ఇచ్చాం". - జయప్రద, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details