Land Occupied in Rayachoti: నూతనంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాలో భూముల ధరలు ఆకాశన్నంటుతుండగా.. ప్రభుత్వ భూములకు రెక్కాలొచ్చాయి. జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. సర్వే నెంబర్ 971/1లో 83.78 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం 40 ఎకరాలు కేటాయించింది. మరో 29.19 ఎకరాలను వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించింది.
మిగిలిన 14.59 ఎకరాల భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేత బినామీల పేరిట కడప గ్రామీణ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంటేషన్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. దిన్నెపాటి గజేంద్రరెడ్డి, జింకా రమేశ్, హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌ల పేరిట దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన భూమి రిజిస్ట్రేషన్ చేశారు. కడప రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి పత్రాలు పరిశీలన కోసం రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపగా అసలు విషయం వెలుగు చూసింది. అవి నిషేదిత ప్రభుత్వ భూములుగా గుర్తించి.. జిల్లా రిజిస్ట్రార్ కలెక్టర్‌కు నివేదిక పంపారు.