Govt to Solve all issues in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నిక పూర్తి కావడంతో పాలనా పరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు సిద్ధమైంది. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు వేగవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు ఇతర అంశాలపై బేరీజు వేసుకున్న సీఎం.. రహదార్ల మరమ్మత్తులపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.
రహదార్ల మరమ్మత్తులు నిత్య ప్రాతిపదికన జరగాలన్న ముఖ్యమంత్రి... రెండు శాఖల్లోనూ సంస్కరణలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు వేగవంతంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. జనవరి 18 నుంచి రెండో విడత కంటివెలుగు నిర్వహించనున్నారు. దళితబంధు పథకం అమలును కూడా వేగవంతం చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయాలని ఇటీవల పార్టీ సమావేశంలో తెలిపారు.