YS Sharmila got bail: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఘటనలతో నిన్నంతా నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన వాహనాలతో ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా, పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రాజ్‌భవన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించటంతో, కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే టోయింగ్ వాహనంతో ఆమె కారును ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అరెస్ట్ చేశారని.. ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, పోలీస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించారని, అధికారుల వస్తువులను సైతం లాక్కొనే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని, షర్మిలకు సూచించింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.