అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. తమ వార్డు సమస్యలు పరిష్కరించటంలేదంటూ అధికార పార్టీకి చెందిన 32వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ సమావేశం ప్రారంభంలోనే ఆందోళనకు దిగారు. ఆరు నెలలుగా తమ వార్డులో మంచి నీళ్లు రావటం లేదని.., మున్సిపల్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని అన్నారు. ప్రజలకు కనీస అవసరమైన రక్షిత మంచి నీరు అడిగితే పట్టించుకునే నాథుడే లేడన్నారు. తాము అధికారంలో ఉన్నా.. వార్డు ప్రజలకు సేవలు అందించలేకపోతున్నామన్నారు. మున్సిపాలిటీలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తమ కాలనీని పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.
మరో వైపు తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ.. హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు సీపీఐ నాయకులతో కలసి కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సమావేశం అనంతరం తెలుగుదేశం కౌన్సిలర్లు మాట్లాడుతూ.. గుంతకల్లు మున్సిపాలిటీలో అభివృద్ధి అటకెక్కిందని మండిపడ్డారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో మున్సిపల్ ఛైర్మన్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఫోటోలకు పోజులిస్తూ ప్రచారాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ కౌన్సిలర్ కాలనీల్లోనే సమస్యలు తీర్చటం లేదని.., ఇక తమ వార్డుల్లో సమస్యలను ఎలా పరిష్కరిస్తారని పాలక మండలిని ప్రశ్నించారు.