Kanekal-Uravakonda main road damage: అనంతపురం జిల్లా కనేకల్ - ఉరవకొండ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. కనేకల్ సమీపంలోని హెచ్ఎల్సి గట్టుపై 2 కిలోమీటర్లు రోడ్డు గుంతలు పడి... వర్షం వస్తే చాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. నిత్యం రాయదుర్గం నుంచి కనేకల్ మీదుగా ఉరవకొండ పట్టణానికి భారీ సంఖ్యలో బస్సులు, కార్లు, జీపులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. బస్సులో ప్రయాణికులు కాలువ గట్టుపై ప్రయాణించేటప్పుడు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకవైపు తుంగభద్ర ఎగువ కాలువ నీటితో భారీగా ప్రవహిస్తుండగా... మరోవైపు లోయ ఉంది. దీంతో వాహనదారులు కాలువ గట్టుపై ప్రయాణించేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని వాపోయారు.
వర్షాలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎదురుగా వాహనాలు వస్తాయి. ఇటు కాలువలోకి పోతాయి. ఇక బ్రిడ్జి అయితే అదురుతోంది. ఇటు వైపు లోయ.. అటువైపు కాలువ ఉంది. లారీ, బస్సు ఎదురెదురుగా వస్తే క్రాస్ చేయడానికి కూడా లేదు.
-వాహనదారులు
భద్రత ప్రశ్నార్థకం
Anantapur district roads problems : రోడ్డుపై మోకాలు లోతు గుంతల వల్ల వాహనాలు దెబ్బతినడమే కాకుండా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వెంటనే శాశ్వతమైన రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు , ప్రయాణికులు కోరుతున్నారు. గత గత కొద్ది రోజుల క్రితం కాలువ గట్టుపై కట్టెలు వేసుకొని వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో రెండు గంటల మేర రాకపోకలు నిలిచిపోయాయి. కనేకల్ మండల కేంద్రం సమీపంలోని హెచ్ఎల్సి గట్టుపై రహదారి మరమ్మతు ల గురించి రాయదుర్గం ఆర్అండ్బి డి.ఈ రవిశంకర్ వివరించారు. రూ.11 లక్షలతో 2.4 కిలోమీటర్లు రహదారిపై గ్రావెల్ వేసి రోలింగ్ చేయించి పటిష్ఠం చేయనున్నట్లు తెలిపారు. పది రోజుల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఈ రోడ్డు అంతా గుంతలు గుంతలుగా ఉంది. ఇక వర్షం వస్తే అంతేసంగతులు. నేను చాలా సార్లు కిందపడిపోయాను. కనేకల్-ఉరవకొండ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంది. బైక్పై ఫ్యామిలీతో ఈ రోడ్డు మీద వెళ్లాలంటే చాలా ఇబ్బందింగా ఉంది. రెండు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు చాలా డేంజర్.
-ప్రయాణికులు
రోడ్డు.. గుంతలమయం..
అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి మడకశిర ప్రయాణం 40 కిలోమీటర్లు. మార్గమధ్యలో కర్ణాటక బోర్డర్ ఎనిమిది కిలోమీటర్ల మేరకు ప్రయాణించాల్సి వుంటుంది. మిగిలిన 32 కిలోమీటర్ల రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల పూర్తిగా గుంతల మయంగా ఉంది. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి ఈ విధంగా ఉంటే ... రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు పెదవి విరుస్తున్నారు. రొద్దం మండలంలోని పెద్ద మంతూరు వద్ద పెన్నా నదిపై నిర్మించిన వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు బయటకు తేలాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అధ్వాన్నంగా కనేకల్- ఉరవకొండ ప్రధాన రహదారి ప్రాణాలు అరచేతిలో..
గతంలో పెనుకొండ మడకశిర ప్రయాణం 45 నిమిషాల నుంచి గంట సమయం పట్టేది. ప్రస్తుతం రోడ్డు గుంతలు పడిపోవడంతో రెండు గంటల సమయం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. గుంతలు తప్పించే క్రమంలో వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. గుంతలను తప్పించేందుకు అవస్థలు పడుతున్నామని చోదకులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణ సమయం ఆలస్యం అవటంతో పాటు వాహనాలు మైలేజీ కూడా సరిగా రావడం లేదని... తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:school food: బడి భోజనం...అప్పుల భారం