ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభ్యర్థుల్లో 'తొలగింపు' ఆందోళన - అనంతపురం

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు దరఖాస్తుల సమర్పణ అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. ఓట్లు తొలగించాలని వచ్చిన అభ్యర్థనలపై విచారించిన అధికారులు... అక్రమార్కుల పనేనని తేల్చారు. ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఓట్ల తొలగింపు కోరుతూ 86వేల దరఖాస్తులు వచ్చాయి.

అభ్యర్థుల్లో 'తొలగింపు' ఆందోళన

By

Published : Mar 5, 2019, 8:01 AM IST

అభ్యర్థుల్లో 'తొలగింపు' ఆందోళన

ఎన్నికల ప్రకటన వెలువడకముందే రాష్ట్రంలో కొందరు నేతలు జిమ్మిక్కులు మొదలుపెట్టారు. ఓటర్లను కులాలు... పార్టీల వారీగా విభజించి లెక్కలు వేస్తున్నారు. తమ పార్టీకి ఓటేస్తారా లేదా అంటూ బేరీజు వేసుకుంటున్న నేతలు... అనుకూలంగా లేనివారి పేర్లు జాబితా నుంచి తొలగించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. చిరునామా మారినా... వలస వెళ్లినా... తమ ఓటును స్వచ్ఛందంగా తొలగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. ఈ వెసలుబాటును తమకు అనుకూలంగా మార్చుకుంటున్న అక్రమార్కులు... తమ వ్యతిరేక ఓటర్ల పేర్లను జాబితాలో లేకుండా చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ఓట్లు తొలగింపు కోరుతూ... ఫారం-7 దరఖాస్తు సమర్పించిన వారి సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలను ధర్మవరం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన దుండగులు... తాజాగా తాడిపత్రి, రాప్తాడు, పుట్టపర్తి, ఉరవకొండతోపాటు అనంతపురం నగరంలో దరఖాస్తు చేశారు. అభ్యర్థనలన్నీ రెండు ప్రధాన పార్టీలకు చెందినవేనని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల నేతలు మీడియా సమావేశాలు పెట్టి... ఆరోపణలు చేసుకుంటున్నారు.

ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో అత్యధికంగా 20 వేల చొప్పున దరఖాస్తులు వచ్చాయి. అధికారులకు అనుమానం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించారు. ఓటు రద్దు కోరిన దరఖాస్తుదారుల వద్దకు సిబ్బంది వెళ్లినపుడు... తాము ఓటు తొలగించాలని కోరలేదని చెప్పారు. దీంతో అక్రమాలు బయటికొచ్చాయి. అధికార తెదేపాతో ప్రయోజనం పొందిన లబ్దిదారుల ఓట్లను తొలగించడానికి ఓ పార్టీకి చెందిన మండలస్థాయి నేతలు ఫారం-7 ఇచ్చినట్లు తేల్చారు. ఎన్నికల కమిషన్ వెబ్​సైట్​లో మోసపూరితంగా ఓట్ల తొలగింపుకు అభ్యర్థనలు చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్​కుమార్ చెప్పారు.

జాబితా నుంచి ఓటర్ల పేర్లు తొలగించేలా... తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉంచిన వెబ్​సైట్​లో సాంకేతిక లోపాలు ఉండటంవల్లనే అక్రమాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఓట్లు తొలగించాలని వస్తున్న దరఖాస్తులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి వీరపాండియన్ చెప్పారు. 86వేల మంది ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసినప్పటికీ... తాము తొలగించడంలేదని... ఆ అధికారం వారికిలేదని కలెక్టర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details